ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర.
జనం న్యూస్,తేది జులై 2025, పార్వతీపురం మండలం(రిపోర్టర్ ప్రభాకర్):
స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో శనివారం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామంలో పర్యటించి పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఇంటింటికి తిరిగి గ్రామస్తులతో మాట్లాడి స్వచ్ఛభారత్ ఆవశ్యకతను వివరించారు. తడి చెత్త పొడి చెత్తను విభజించి బండికి అప్పగించాలని కోరారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు, ఆరోగ్యాలను కాపాడుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. స్వచ్ఛ కార్మికులను సత్కరించిన ఎమ్మెల్యే వారు ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రస్తుతించారు. అలాగే స్థానికులతో కలిసి పరిసరాలను పరిశుభ్రపరిచారు. అనంతరం మాట్లాడుతూ పెదబొండపల్లి ప్రజలు నిండు నూరేళ్లు బ్రతికేలా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాలను కాపాడుకుని ముందుకు సాగాలని సూచించారు. జిల్లాలో పెద బొండపల్లి గ్రామానికి ప్రత్యేక స్థానం ఉందని, పరిశుభ్రతలోను ఆ ఒరవడిని కొనసాగించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్ స్వచ్ఛ ఆంధ్ర కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వాలు విరివిగా అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామాలను సుందరంగా తీర్చుకుందామని ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా స్పెషల్ ఆఫీసర్ దినేష్ గుప్తా, డిఆర్డిఓ, అధికారులు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.