నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్లేవారే నాయకులు: కవిత
జనం న్యూస్ జూలై 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలో చురుకైన కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దుతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కొత్త పంథాలో వెళ్తేనే సంస్థలకు మనుగడ ఉంటుందని, కాలానుగుణంగా తెలంగాణ జాగృతి కూడా తన పంథాను మార్చుకుంటుందని అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో శనివారం మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన 'లీడర్'రాజకీయ శిక్షణ కార్యక్రమాన్ని కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లీడర్ అంటే కేవలం సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి పదవులు పొందడమే కాదన్నారు. లీడర్ ఆకాశం నుంచి ఊడిపడరని, ఎవరూ నాయకత్వ లక్షణాలతో పుట్టరని కవిత పేర్కొన్నారు.నేర్చుకుంటూ, తనను తాను మార్చుకుంటూ ముందుకెళ్లేవారే నాయకులు అవుతారన్నారు. మూస పద్ధతిలో కొనసాగేవాడు ఎప్పుడూ నాయకుడు కాడని అన్నారు. తోటివారి గోప్యత, మర్యాదను కాపాడకుండా నోటికి వచ్చింది మాట్లాడటమే ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయిందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దృష్ట్యా తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలనేదే జాగృతి లక్ష్యమని స్పష్టం చేశారు. ఆగస్టు నుంచి అన్ని జిల్లాల్లో లీడర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తామని వెల్లడించారు.తెలంగాణ జాతికి ఉన్న అద్భుతమైన సాంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా తెలంగాణ జాగృతి పనిచేస్తుందన్నారు. తెలంగాణకు నష్టం జరుగుతుంటే జాగృతి ఊరుకోబోదని, తెలంగాణకు నష్టం చేసే బనకచర్ల ప్రాజెక్టును ఆపి తీరుతామని కవిత స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తామని కవిత ప్రకటించారు..