జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి: జనం న్యూస్. జూలై 29, కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి తెలిపారు. మంగళవారం జిల్లాలోని జైనూర్ మండలం ఉషేగాం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, పారిశుధ్య నిర్వహణ అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని, విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, విద్యా బోధన, వసతి సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించాలని, అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఈ క్రమంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఇప్పటినుండే సాధన చేసే విధంగా ఉపాధ్యాయులు కార్యచరణ ప్రకారం విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.