మద్నూర్ జులై 30 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో ఉన్న హాస్పిటల్ ను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు సందర్శించారు. అనంతరం హండే కేలూర్ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించారు. లబ్దిదారుతో మాట్లాడి ఇంటి ముందు మొక్క నాటమనీ కోరడంతో కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇంటి ముందు మొక్కను నాటడం జరిగింది.ఆ వెంటనే మండలం లోని మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ వర్షాకాలం కావున గ్రామాలలో కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని , ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చిన పై అధికారుల దృష్టికి తీసుకు వచ్చి అట్టి సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా చూడాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపండి, పింఛన్ల పంపిణీ, త్రాగు నీరు, రోడ్లు, వాగులు, చెరువులు అన్ని సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉండాలని ఆదేశించారు.సమీక్ష సమావేశం అనంతరం భూ భారతి సదస్సు లో వచ్చిన దరఖాస్తుకు సంబంధిత భూమి రికార్డు ప్రకారం భూ యజమాని సర్వే నెంబర్ గుర్తించి తగు వ్యక్తికి భూమి పట్టా హక్కులు ఇవ్వడం కోసం సంబంధిత సర్వే నెంబర్ గల భూమిని మద్నూర్ గ్రామ శివారు సోనాల రోడ్డు లో జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు. రికార్డు లను పరిశీలించి భూ భారతి రెవెన్యూ దరఖాస్తులు పరిష్కరించే విధానం బాగుంది అని సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ గారి వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి గారు, మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, గిర్దవార్ ఏం శంకర్, సర్వేయర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.