ప్రజలకు ప్రభుత్వానికి జవాబుదారీ తనంగా అధికారులు ఉండాలి..
సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సులో ప్రధాన కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి.
భద్రాద్రి కొత్తగూడెం
30జూలై ( జనం న్యూస్)
సమాచార హక్కు ప్రజల ప్రాథమిక హక్కు అని, ప్రజల హక్కును కాపాడటానికి అధికారులు ప్రజలకు ప్రభుత్వానికి జవాబు దారితనంగా వారధిలా నిలువాలని సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమాచార హక్కు చట్టం ( ఆర్టిఐ ) అమలు పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర ప్రధాన కమిషనర్ బో రెడ్డి అయోధ్య రెడ్డి, సహ కమిషనర్లు దేశాల భూపాల్ మరియు పి.వి. శ్రీనివాస్ రావు గురువారం జిల్లాకు విచ్చేశారు. జిల్లాకు విచ్చేసిన కమిషనర్లకు ముందుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మరియు జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ సౌరబ్ శర్మ పూల మొక్కలు ఇచ్చి ఆహ్వానం పలికారు. అనంతరం ప్రధాన కమిషనర్ బోరేటి అయోధ్య రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఐ డి ఓ సి కార్యాలయం ప్రాంగణంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా కమిషనర్లు మొక్కలు నాటారు. జిల్లాలో సమాచార హక్కు చట్టం కమిషనర్ల పర్యటన నేపథ్యంలో ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరం లో ఆర్.టి.ఐ యాక్ట్ అమలు చేయు విధివిధానాలపై క్షుణ్ణంగా పౌర సమాచార అధికారులకు చట్టనిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్ర ముఖ్య పౌర సమాచార కమిషనర్ బో రెడ్డి అయోధ్య రెడ్డి మరియు ఇతర కమిషనర్లు పి.వి శ్రీనివాసరావు, దేశాల భూపాల్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మరియు ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఐ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మొదటిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రావడం జరిగిందని సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ మరియు వివిధ శాఖల అధికారులు చూపించిన చొరవ హర్షించదగ్గ విషయం అని అన్నారు. సమాచార హక్కు చట్టం 136 దేశాల్లో అమలు అవుతుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టిఐ సమర్థవంతంగా అమలవుతుందన్నారు. సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, అవినీతి నిర్మూలన లక్ష్యంగా సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది అన్నారు. ఈ చట్టంలోని సెక్షన్లు, సబ్ సెక్షన్ లపై పౌర సమాచార అధికారులు చదివి సమగ్ర అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న 29 ప్రభుత్వ శాఖల్లో 15 శాఖల్లో ఎటువంటి కేసులు లేకపోవడం హర్షించదగ్గ విషయంగా ఆయన పేర్కొన్నారు. 136 దేశాల్లో ఆర్టిఐ యాక్ట్ అమల్లో ఉందన్నారు. ప్రపంచంలోనే భారతదేశం 8వ స్థానంలో ఉందని, రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి రావాలని అదేవిధంగా దేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిపే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబు గారితనం ఎంత అవసరమో పారదర్శకత కూడా అంతే అవసరమని ఆర్టిఐ యాక్ట్ ద్వారా పూర్తి సమాచారం అందించినప్పుడు మాత్రమే జవాబుదారీతనం మరియు పారదర్శకతకు సార్ధకత చేకూరుతుందన్నారు. గత పది సంవత్సరాల కాలంలో సమాచార కమిషనర్ అందుబాటులో ఉంచకపోవడం వల్ల రాష్ట్రంలో 18 వేల కేసులు సమాచార హక్కు చట్టం కమిషనర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఆగస్టు నెలలో పెండింగ్లో ఉన్న కేసులను పూర్తిగా పరిష్కరించి కొత్త దరఖాస్తుల ద్వారా ముందుకు వెళ్ళబోతున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రెండు నెలల్లో 30 శాఖల కేసులు పూర్తిగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.
ప్రజలు సమాచారం కోసం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమాచారం అందజేయాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద సిటిజన్ షార్ట్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సరైన కారణాలు చూపించకుండా ఆర్టిఐ యాక్ట్ ద్వారా చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించకూడదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం అందుబాటులో ఉంది కాబట్టి అధికారులందరూ బాధ్యతగా తీసుకొని త్వరితగతిన తగిన సమాచారం ప్రజలకు అందించాలన్నారు.
సమాచార హక్కు చట్టం పై పౌర సమాచార అధికారులకు అవగాహన పెంపొందించే విధంగా రాష్ట్రంలో 11 జిల్లాలు ఎంపిక చేసుకుని చట్టంలోని సెక్షన్ల పై పూర్తి అవగాహన కల్పిస్తున్నామన్నారు. దీని ద్వారా ఆర్టిఐ కేసులను త్వరితగతిన పరిష్కరించవచ్చు అన్నారు. అధికారులందరూ ప్రజలకి తగిన సమాచారం అందించేందుకు ముందుకు రావాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో 17 శాఖల్లో వచ్చే మార్చి లోపు అన్ని కేసులు పరిష్కార మార్గాలు చూపి సమాచారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మరుగున పడిన వ్యవస్థను నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకువచ్చి ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ… జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలయ్యే అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని శాఖల అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించే విధంగా సమావేశాలు మరియు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో నైనా సమాచారం కావాలని దరఖాస్తు చేసుకున్నప్పుడు నిబంధనలకు లోబడి సమాచారం అందించే విధంగా అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని వివరించారు. ఈ అవగాహన సదస్సులో భాగంగా పౌర సమాచార అధికారులకు సమాచార హక్కు చట్టంపై ఉన్న సందేహాలను కమిషనర్లు నివృత్తి చేశారు. జిల్లాకు మొదటి సారిగా విచ్చేసిన సమాచార హక్కు కమిషనర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శాలువా మరియు మెమొంటోతో సత్కరించారు. ఈ అవగాహన సదస్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పి సీఈవో నాగలక్ష్మి, ఆర్డీవోలు మధు, దామోదర్, అన్ని శాఖల పౌర సమాచార అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.