జనంన్యూస్.నిజామాబాద్, ఆగస్టు 01.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన నవీపేట్ మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్, ప్రైవేట్ ఎరువుల విక్రయ కేంద్రాలను, వెటర్నరీ సెంటర్, తహసిల్ ఆఫీసు తదితర కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా తహసిల్దార్, ఇతర సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆశించిన రీతిలో దరఖాస్తుల పరిష్కారం జరగడం లేదని ఈ సందర్భంగా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పదేపదే చెబుతున్నప్పటికీ, ఆర్జీల పరిష్కారంలో జాప్యం ఎందుకు జరుగుతోందని నిలదీశారు. రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.అంతకుముందు సీ.హెచ్.సీని సందర్శించిన కలెక్టర్, ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ , ల్యాబ్, ఇన్ పేషంట్ వార్డు, వ్యాక్సినేషన్ రూమ్, ఆయుష్ విభాగం, ప్రసూతి గది, ఫార్మసీ, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్ తో పాటు, విధుల్లో ఉన్న సిబ్బంది హాజరును పరిశీలించారు. సీ.హెచ్.సీ పనితీరు, నిర్వహణ, అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఔషదాల గురించి ఆరా తీశారు. సీ.హెచ్.సీ ద్వారా రౌండ్ ది క్లాక్ సేవలు అందించాలని, సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెంచాలని, అన్ని గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వ్యాక్సినేషన్, గర్భిణీలకు క్రమం తప్పకుండా నిర్వహించే పరీక్షలను నూటికి నూరు శాతం జరిగేలా పర్యవేక్షణ జరపాలని వైద్యాదికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అంగన్వాడీ సెంటర్ ను సందర్శించి, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని, కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నవీపేట, దర్యాపూర్ లలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించి, మద్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలు ఉండాలని, పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు. దర్యాపూర్ స్కూల్ ఆవరణలో నిరుపయోగంగా శిధిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేయించాలని, ప్రహరీ గోడ, బాలికల టాయిలెట్స్ మరమ్మతులు తదితర మౌలిక సదుపాయాల కోసం అమ్మ ఆదర్శ పాటశాల కమిటీ ద్వారా ప్రతిపాదనలు సమర్పించాలని హెచ్.ఎంకు సూచించారు. బడికి ఆనుకుని నివాసాలు కలిగి ఉన్న పలువురు స్థానికులు పాఠశాల వెనుక భాగంలోని ఆవరణలో చెత్తాచెదారం, వ్యర్థాలు వేస్తున్నారని గమనించిన కలెక్టర్, పంచాయతీ కార్యదర్శిని పిలిపించుకుని బడి ఆవరణను శుభ్రం చేయించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.అక్కడినుండి కలెక్టర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను, ఇతర ప్రైవేట్ ఎరువుల విక్రయ కేంద్రాలను సందర్శించి, ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల కోసం వచ్చిన రైతులను పలుకరించి, అవసరాలకు సరిపడా ఎరువులు అందిస్తున్నారా అని ఆరా తీశారు. క్రయవిక్రయాల వివిరాలు ఈ-పాస్ వివరాలతో సరిపోల్చి చూశారు. ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని అధికారులు తెలిపారు. ఎరువుల గోడౌన్ లు, విక్రయ కేంద్రాల వద్ద ఎరువుల స్టాక్ వివరాలతో కూడిన బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అనంతరం పశు వైద్యశాలను సందర్శించిన కలెక్టర్, పశువులకు వ్యాధి నిరోధక టీకాలు, కృత్రిమ గర్భధారణ వంటి సేవలు అందిస్తున్నారా, సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాల పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ వెంకట రమణ, ఏ.ఓ నవీన్, వెటర్నరీ డాక్టర్ బి.నరేందర్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హన్మంత్ రావు, ఫర్హతున్నీసా తదితరులు ఉన్నారు.