జనం న్యూస్ ఆగష్టు 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఎక్కువగా ఉంది. అన్ని రంగాల్లో డిజిటల్ విధాన వినియోగం తప్పనిసరి అయ్యింది. మనిషి ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు ప్రతి పని సాంకేతికతతో ముడిపడి ఉంది. ప్రపంచం మొత్తం అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఉంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేకపోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి డిజిటల్ యుగంలో జీవిస్తున్నాడు అనడంలో సందేహం లేదు. మహానగరాల నుండి మారుమూల ప్రాంతాల వరకు డిజిటల్ పేమెంట్ విధానం తప్పనిసరి అయింది. సోషల్ మీడియా వినియోగం కూడా బాగా పెరిగింది. ఈ డిజిటల్ విధానంలో ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్ని నష్టాలకు కూడా అవకాశం ఉంది. గతంలో దొంగతనాలు, దోపిడీలు ఇంటికి వచ్చి చేసేవారు లేదా ప్రజలకు మారణ ఆయుధాలు చూపించి బెదిరించి దోచుకునేవారు కానీ ఈ డిజిటల్ విధానాన్ని అవకాశం చేసుకుని సైబర్ నేరగాళ్లు, ప్రజల యొక్క అత్యాశ, భయాన్ని పెట్టుబడిగా చేసుకొని ప్రతిరోజు కొన్ని లక్షల రూపాయలు దండుకుంటున్నారు. అనేక మాయ మాటలు చెప్తూ, ఫోన్స్ హ్యాక్ చేస్తూ, అనేక సరికొత్త విధానాలను అనుసరిస్తూ, మారుతున్న సాంకేతికతను అనుకూలంగా చేసుకొని సైబర్ నేరాలతో ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అట్టి విధానాలను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం తప్పక ఉంది. *లక్కీ లాటరీ & లోన్స్*గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ ఫోన్ నెంబర్ కు లక్కీ లాటరీ వచ్చిందని లేదా ఆన్లైన్లో లోన్ మంజూరు అయింది అని చెప్పి అత్యాశ చూపించి, కొంత డబ్బు ప్రాసెసింగ్ ఫీజు గా చెల్లించాలని మరియు ఫోనుకు ఓటిపి వస్తుంది చెప్పాలని తర్వాత డబ్బులు తమ ఖాతాలో జమవుతాయని చెప్పి మోసం చేయడం జరుగుతుంది. *ఏపీకె ఫైల్స్, రివార్డ్ ఫైల్స్*సైబర్ నేరగాళ్లు ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్) ఫైల్స్, రివార్డ్ ఫైల్స్, పీఎం కిసాన్ ఫైల్స్, ఎస్బిఐ, టిజిబి కేవైసీ ఫైల్స్ పేర్లతో వాట్సాప్ కు పంపుతున్నారు. వాటిని ఓపెన్ చేసి క్లిక్ చేస్తే సంబంధిత వ్యక్తుల ఫోన్ హ్యాక్ చేసి, ఫోన్ నియంత్రణ సైబర్ నేరగాల చేతికి వెళుతుంది వెంటనే సొమ్మును కాచేస్తున్నారు.*బ్యాంకు అధికారుల పేరిట*బ్యాంకు నుండి కాల్ చేస్తున్నాము. మీ ఖాతాకు కేవైసీ చేయాలని ఆధార్ నెంబర్, పాన్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్ లింక్ చేయాలని లేకుంటే ఖాతా ను నిలిపివేయడం జరుగుతుందని తెలిపి ఓటిపి వస్తుంది ఓటిపి చెప్పడంతో కేవైసీ పూర్తి అవుతుంది అని చెప్పి ఖాతాలు ఖాళీ చేయడం జరుగుతుంది. బ్యాంకు సేవల విషయంలో ప్రజలు జాగ్రత్త వహించి నేరుగా బ్రాంచ్ కి వెళ్లి బ్యాంకు సేవలు పొందండి.*కాల్ మెర్జింగ్*గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి మీ స్నేహితుని వద్ద నుండి మీ నెంబర్ తీసుకున్నాను లేదా మీ స్నేహితుడు కాల్ చేయమన్నారు. ఉద్యోగం కొరకు మీతో మాట్లాడాలి, త్వరలోనే మీ స్నేహితుడు మనతో కాల్ లో జాయిన్ అవుతారు అంటూ వివిధ కారణాలు బుకాయిస్తూ కాల్ మెర్జింగ్ చేసి సైబర్ నేరగాళ్లు ఫోన్ హ్యాక్ చేయడం జరుగుతుంది. *బహుమతుల పేరిట*మీ పేరుపై బహుమతి వచ్చిందని లక్షలు విలువ చేసే కారు, ట్రక్, వ్యాన్ వంటి వాహనాలు గెలుపొందారని వాట్సాప్ కు మెసేజ్ పంపడం లేదా నేరుగా కాల్ చేసి ఆశ చూపించి కొంత డబ్బు డిపాజిట్ చేస్తే వాహనం మీకు వస్తుంది అని తెలిపి మోసం చేయడం జరుగుతుంది.*సంక్షేమ పథకాల పేరుతో*సంక్షేమ పథకాల పేరిట లింక్స్, యాప్స్ వాట్సాప్ కు పంపడం లేదా కాల్ చేసి వివరాలు నమోదు చేయడం ద్వారా సంక్షేమ పథకాలు మంజూరు అవుతాయి లబ్ది పొందవచ్చు అని కట్టుకథ చెప్పి సైబర్ నేరగాళ్లు మోసాలు చేయడం జరుగుతుంది. సంక్షేమ పథకాలు ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రభుత్వ కార్యాలయాల నుండి అందుతాయని ప్రజలు గమనించాలి. *డిపి ఫొటోస్*వాట్సాప్, ఫేస్బుక్ మరియు మిగతా సామాజిక మాధ్యమాలలో డిపి గా పెట్టే ఫోటోలను డౌన్లోడ్ చేసుకొని తిరిగి అదే వ్యక్తికి వాట్సాప్ ద్వారా పంపించి కిడ్నాప్ చేశామని లేదా ఫోటోలను మార్కింగ్ చేసి అసభ్యంగా మార్చి బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది. *వీడియో కాల్స్ తో*వాట్సాప్ వీడియో కాల్ చేయడం కాల్ చేసిన వ్యక్తి లేడీ నగ్నంగా ఉండి కాల్ మాట్లాడుతూ అట్టి కాల్ ను రికార్డ్ చేసి లేదా స్క్రీన్ షాట్ తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది.*డిజిటల్ అరెస్ట్*అగంతకులు పోలీస్ ఫోటో సెట్ చేసి ఉన్న నెంబర్ నుండి కాల్ చేసి పోలీసులమంటూ, ప్రభుత్వ ఉన్నత అధికారులమంటూ తమపై కేసు నమోదు అయిందని, పోలీసు బృందం అరెస్టు చేయడానికి బయలుదేరిందని, అరెస్టుతో సమాజంలో ఉన్న తమ పరువు, కుటుంబ పరువు పోతుందని సెటిల్మెంట్ చేసుకొని డబ్బు పంపితే అరెస్టు నిలిపివేస్తామని మోసం చేయడం జరుగుతుంది. *ఉద్యోగ పేరిట మోసలు*వర్క్ ఫ్రం హోం, పార్ట్ టైం ఉద్యోగం పేరిట రోజుకు కొన్ని గంటలు పనిచేస్తే వేలల్లో ఆదాయం అని ఆన్లైన్, వాట్సాప్ లో ప్రకటనలు చూస్తూ ఉంటాం నిజమే అని ఆశతో క్లిక్ చేస్తే క్షణాల్లో డబ్బులు కాజేస్తారు. *బిల్లుల పేరిట మోసం*కరెంట్ బిల్లు, వైఫై బిల్లు, క్రెడిట్ కార్డ్ పెండింగ్ అమౌంట్ కట్టాలని లేకుంటే సేవలు నిలిచిపోతాయని కాల్ చేసి మోసం చేయడం జరుగుతుంది. *సిటీ అధికారుల పేరుతో*తల్లిదండ్రులకు కాల్ చేసి మీ పిల్లలు నగరాల్లో చదువుకుంటున్నారు కదా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారు, డ్రగ్స్ తీసుకొని దొరికారు, యాక్సిడెంట్ చేసి దొరికారు వీరిపై కేసు నమోదు చేస్తున్నాము. మీరు డబ్బులు పంపిస్తే వదిలేస్తాము అని మోసం చేయడం జరుగుతుంది. *ఫేక్ యార్డ్స్*యూట్యూబ్, ఆన్లైన్ గేమ్స్ నందు కొన్ని ఫేక్ యార్డ్స్ తో ఆశ చూపించి క్లిక్ చేయగానే సైబర్ నేరగాళ్లు డబ్బులు కాల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.*సిరీస్ నెంబర్లతో జాగ్రత్త*+92, +1, +968, +44 వంటి సిరీస్ నెంబర్ల నుండి ఫోన్ వస్తే కాల్ లిఫ్ట్ చేశారో అకౌంట్లో ఉన్న డబ్బు గల్లంతవుతుంది. ఈ సిరీస్ నెంబర్లనుండి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయవద్దు. గతంలో టెలికాం సంస్థలు, పోలీస్ అధికారులు ప్రజలకు సూచించడం జరిగింది. *ఈజీ మనీ పేరట* సులువుగా డబ్బు సంపాదించవచ్చు అని చైన్ సిస్టం బిజినెస్, బిట్ కాయిన్, క్రిప్టా కరెన్సీ, సిస్టం బ్యాంకు రివార్డు, ట్రెండింగ్ వంటి వాటిని ఆశగా చూపించి సులువుగా డబ్బు పొందవచ్చు అని సైబర్ మోసగాళ్లు నమ్మబలికి, మోసగాళ్లు చెప్పినట్లు చేసి లక్షల్లో నగదు పోగొట్టుకుంటున్నారు. *ఆన్లైన్ బెట్టింగ్*తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ తో, నిషేధిత ఇతర యాప్స్ తో రెట్టింపు డబ్బు వస్తుందని అత్యాశకు పోయి యువత, విద్యార్థులు ప్రతిరోజు వేలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఇవే కాకుండా సాంకేతికత అభివృద్ధి చెందిన విధంగానే సైబర్ నేరగాళ్లు కొత్త విధానాలతో సైబర్ మోసాలకు తెర లేపుతున్నారు. వారి మాయలో పడకుండా, మోసపూరిత మాటలను ప్రజలు నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలి.*సైబర్ మోసాలపై ఫిర్యాదు విధానం*ఒకవేళ సైబర్ మోసానికి గురి అయ్యామని అనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయాలి. లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఆన్లైన్లో https;//cybercrime.gov.in అనే పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు.*ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలి*గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు, ఆధార్, బ్యాంక్ ఖాతా, ఏటీఎం, కుటుంబ సభ్యుల వివరాలు చెప్పకూడదు. మొబైల్ కు వచ్చే లింక్స్, ఏపీకే ఫైల్స్, రివార్డ్ ఫైల్స్ వంటి వాటిని ఓపెన్ చేయకూడదు. గుర్తుతెలియని నెంబర్లనుండి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. సులువుగా డబ్బు సంపాదించడం, తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించడం, చైనేజ్ సిస్టంతో డబ్బు సంపాదించడం వంటి ప్రకటనలను ప్రజలు నమ్మకూడదు. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్, ఫేక్ యాప్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అగంతకులు కాల్ చేసి కుటుంబ సభ్యుల విషయాలు అడుగుతే వెంటనే అప్రమత్తమై కుటుంబీకులు ఎక్కడ ఉన్నారో వారితో సమన్వయం చేసుకోవాలి. అత్యాశకు వెళ్లి అకౌంట్లను ఖాళీ చేసుకోకూడదు. సైబర్ మోసాలకు గురి అవుతున్న వారిలో విద్యావంతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య రైతులు మరియు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు ఎక్కువగా ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి సైబర్ మోసాల పై అవగాహన తప్పనిసరి. ప్రభుత్వ అధికారులు, బ్యాంక్ సిబ్బంది, పోలీస్ శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటించాలి. ముఖ్యంగా పోలీస్ శాఖ తెలిపే నూతన సూచనలను ప్రతి ఒక్కటి తప్పకుండా తెలుసుకోవాలి. మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అవగాహన కలిగించాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుని పైన ఉన్నది. కావున సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పకుండా ఉండాలి. సైబర్ నేరాలను అవగాహన పెంచుకోవడం ద్వారానే అరికట్టవచ్చు. కాబట్టి సైబర్ మోసాల పట్ల అవగాహన పెంచుకుందాం - సైబర్ నేరాలను అరికడదాం.(ప్రజల అభ్యుదయే లక్ష్యంగా ప్రతి సమాచారాన్ని ప్రజల వద్దకు చేరవేస్తూ వారి రక్షణే వీరి ద్యేయంగా అనునిత్యం చట్టాల పై మరియు ప్రజా సమస్యల పై అవగాహన కల్పిస్తున్న )సమాచార హక్కు రక్షణ చట్టం 2005 తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా౹౹ కొండగుర్ల కమలాకర్ మరియు కొమురం భీం అసిఫాబాద్ జిల్లా సంస్థ సభ్యులు.