బిచ్కుంద జులై 7 జనం న్యూస్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చేనేత రంగం, చేనేతన్నల కుటుంబాల జీవితాలలో వెలుగులు నిండుతాయని, ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చెందుతామని కోటి ఆశలతో చేనేత కార్మికులు ఎదురు చూశారు. కానీ ఆ విధంగా జరగకపోగా వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాలకుల అలసత్వం, అవినీతి, వివక్షతో పూర్తిగా చేనేత రంగాన్ని సమస్యల సుడిగుండంలో నెట్టివేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలను తమ గొప్పతనం పెంచుకోవడానికే ఉపయోగించుకున్నది తప్పితే ఆ రంగానికి చేసింది ఏమీ లేదు.తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగం ప్రస్తుతం కొన ఊపిరితో ఉంది. కాంబోడియా దేశం చేనేత మగ్గాన్ని వారి కరెన్సీ నోటుపై ప్రింట్ చేసి గౌరవాన్ని చూపిస్తున్నారు. కానీ మనదేశంలో మాత్రం చేనేతను ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి. చేనేత రంగాన్ని వారసత్వ సంపదగా, ఒక కళగా, అభివృద్ధికి తోడ్పడే వృత్తిగా, ఉపాధి అవకాశాలు కల్పించే రంగంగా ప్రభుత్వాలు, పౌర సమాజం స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.ఈ నైపుణ్యం దేశానికే తలమానికం అగ్గిపెట్టెలో ఆరు గజాల చీర ఇమడగల సున్నితమైన వస్త్రం తయారు చేయగల నైపుణ్యం, ఎటువంటి చిత్రాన్నైనా చూసి దానిని వస్త్రంపై నేయటం తెలంగాణ చేనేత నేతగాళ్ల సొంతం. కుట్టు లేని అంగీలు, కటింగ్ లేని గాంధీ టోపీలు స్వాతంత్ర పోరాటానికి అందించిన ఘనత తెలంగాణ నేతన్నది. పోచంపల్లి టై అండ్ డై ఇక్కత్ చీరలు, పట్టు, కాటన్ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, గద్వాల పట్టు చీరలు, నారాయణపేట కాటన్ చీరలు, వరంగల్ తివాచీలు, డర్రీలు, కరీంనగర్ కాటన్ దుప్పట్లు, హకీంపేట్ టిస్సార్ పట్టు చీరలు, ఆర్మూర్ పట్టు చీరలు, పీతాంబరి పట్టు జరీ చీరలు పలు రకాల నాణ్యమైన ఉత్పత్తులు రాష్ట్ర నేతన్న నైపుణ్యానికి ప్రతిబింబం. దేశానికి తలమానికం. పస్తులూ, ఆకలి చావులే మిగిలాయ్ దేశ వస్త్ర ఉత్పత్తులలో తెలంగాణ చేనేత వస్త్రోత్పత్తులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. రంగుల అద్దకం, ప్రింటింగ్, చిటికి పరిశ్రమ, డిజైన్లు మొదలైన నైపుణ్యతతో ఆధునిక మార్కెట్లో సైతం పోటీ పడుతున్నారు. తెలంగాణ చేనేత కార్మికులు తరతరాల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ప్రజల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా వస్త్రోత్పత్తులు చేస్తూ తమ నైపుణ్యాన్ని ద్విగు ణీకృతం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో చేనేతన్నల జీవితాలు అత్యంత దుర్భరంగా, దయనీయంగా మారిపోయాయి. నేడు చేనేత రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. చేనేత మగ్గాన్ని నమ్ముకొని బతుకులీడుస్తున్న నేతన్నలు పని లేక పస్తులు ఉంటూ, ఆకలి చావులు ఆత్మహత్యలకు గురవుతున్నారు. తరతరాల నుంచి నమ్ముకున్న చేనేత మగ్గం నేతన్నల పాలిట ఉరి పగ్గంగా మారింది. చేనేతకు ప్రత్యేక పాలసీ తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకార, వ్యవసాయ పరపతి సంఘాలు పనిచేస్తున్నాయి. అవన్నీ కొనసాగుతున్నప్పుడు చేనేత నేత కార్మిక సహకార సంఘాల పట్ల ఎందుకు చిన్నచూపు వివక్ష చూపిస్తున్నారో ప్రభుత్వాలు తెలపాలి. రాష్ట్ర శాసనసభలో 2024-25 సం.లో ప్రవేశపెట్టిన చేనేత బడ్జెట్లో కేటాయించింది 187 కోట్లు మాత్రమే. ఇందులో ఉద్యోగుల జీతభత్యాలు, కార్యాలయాల ఖర్చులు పోను మిగిలేది అంతంత మాత్రమే! ఇలా అయితే చేనేత రంగం ఎలా అభివృద్ధి చెందుతుంది? అందుకే ప్రభుత్వం చేనేత రంగానికి ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేయాలి. చేనేత సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి. చేనేతన్నలకు సంవత్సరానికి 36 వేల కోట్ల పెట్టుబడి సహాయం అందించాలి. తెలంగాణ రాష్ట్రంలో చేనేత మ్యూజియం ఏర్పాటు చేయాలి.నేతన్న నడ్డి విరిచిన కేంద్రం!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా చెప్పిన మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటని చందాన ఆ రంగానికి సహాయం చేయకపోగా చేనేతకు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించి చేనేత మనుగడని ప్రశ్నార్థకంగా చేశారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డ్ రద్దు చేశారు. కేంద్ర పత్తి బోర్డు రద్దు చేశారు. సిల్క్ బోర్డును రద్దు చేశారు. ఐసీఐసీఐ నాబార్డ్ మొదలగునవి రద్దు చేయడమే కాకుండా మహాత్మా గాంధీ బుంకర్ బీమా పథకం, థ్రిప్ట్ పథకాలను రద్దు చేయడం, చేనేత రిజర్వ్ చట్టాన్ని అమలు చేయలేకపోవడం, చేనేతలతో తయారైన వస్త్రాలను కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కొనుగోలు చేయకపోవడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వాటి నుంచి చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తూనే వస్తోంది. చేనేతపై జీఎస్టీని మొట్టమొదటిసారిగా 2017 సంవత్సరంలో ఐదు శాతం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందాన చేనేతలపై విధించింది. చేనేతకు సంబంధించిన పట్టు, నూలు, రంగులు, రసాయనాలపై అన్ని రకాల జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలి. హమీలు నెరవేర్చాలి! భారత్ జోడోయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ జడ్చర్ల బహిరంగ సభలో నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేనేత కార్మికులపై, ఉత్పత్తులపై పడే జీఎస్టీని ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు దానిని తెలంగాణ ప్రభుత్వం అమలు పరచడం లేదు. తెలంగాణలో చేనేత ఉత్పత్తి 1000 కోట్లు ఉంటుంది. ఐదు శాతం జీఎస్టీ భరిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కేవలం 50 కోట్ల వరకు భారం పడుతుంది. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. (నేడు జాతీయ చేనేత దినోత్సవం) డాక్టర్ రాజు చేనేత బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు.