జనం న్యూస్ 11 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) అగ్రనేత అమరజీవి కామ్రేడ్ దాసరి నాగభూషణ రావు గారు లాంటి ప్రజా పోరాటాల యోధుల దేహాలకి తప్పా వాళ్ళ ఆశయాలకు మరణం ఉండదని విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి మరియు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు. ఆదివారం ఉదయం డి.ఎన్.ఆర్ అమర్ భవన్ లో అమరజీవి కామ్రేడ్ దాసరి నాగభూషణరావు గారు 99 వ జయంతి కార్యక్రమం విజయనగరం నియోజకవర్గ సిపిఐ సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ దాసరి చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శి అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ రంగరాజు, బాయి రమణమ్మ, పురం అప్పారావు, మార్క్స్ నగర్ శాఖ కార్యదర్శి అప్పరుబోతు జగన్నాధం లు నివాళులు అర్పించారు. అనంతరం బుగత అశోక్ మీడియాలో మాట్లాడుతూ 1926 ఆగస్టు 10 వ తేదీ నూజివీడు తాలూకా దిగవల్లి గ్రామంలో దాసర వీర రాఘవయ్య- సరస్వతి తల్లిదండ్రులు రైతు కుటుంబంలో దాసరి గారు జన్మించారన్నారు. ఉమ్మడి ఆంధ్రపదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లా సిపిఐ నిర్మాణ బాధ్యులుగా ఉండి జిల్లాలో కామ్రేడ్ మొకర అప్పారావు, కామ్రేడ్ డి. నరసింహారావు ( రవి మాష్టారు) కామ్రేడ్ బొర్రా చిన్నా, కామ్రేడ్ పి.కామేశ్వరరావు, కామ్రేడ్ బుగత సూరిబాబు, కామ్రేడ్ వెలగాడ పైడిచిట్టి, కామ్రేడ్ వి.కృష్ణంరాజు లాంటి ఎంతో మంది నాయకులను తయారుచేసి జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) ఉద్యమ నిర్మాణానికి ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. జిల్లాలో గిరిజన హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలకి నాయకత్వం వహించారని తెలిపారు. సాలూరు ప్రాంతంలో వందల ఎకరాలు ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతి భూపోరాటాలు నడిపించి పెదలకి భూములు, ఇళ్ళ స్థలాలు ఇప్పించారని తెలిపారు. విజయనగరం పట్టణంలో బుచ్చెన్న కోనేరు, శాంతి నగర్, పూల్ బాగ్ లలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి కామ్రేడ్ దాసరి గారి నాయకత్వంలో వందలమంది పేదలకి ఇళ్ళ స్థలాలు ఇప్పించిన ఘనత సిపిఐ కి ఉందని అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయం కోసం స్థలం కోసం శ్రమించి కార్యాలయ భవనం నిర్మానం కోసం దాసరి గారు నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఇంటింటికి తిరిగి జోలి పట్టుకుని ప్రజలు, కార్మికుల దగ్గర నుంచి నిధి వసూళ్ళు చేసి భవనాన్ని నిర్మించారు అని తెలిపారు. అందుకే సిపిఐ జిల్లా కార్యాలయానికి అమరజీవి కామ్రేడ్ దాసరి నాగభూషణ రావు అమర్ భవన్ అని పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. 1942లో నూజివీడు ఎస్ ఆర్ ఆర్ హై స్కూల్లో చదువుకుంటూ ఏఐఎస్ఎఫ్ కార్యకలాపాలకు ఆకర్షితులై విద్యార్థి ఉద్యమంలో చేరారనీ తెలిపారు. కామ్రేడ్ తమ్మారెడ్డి సత్యనారాయణ విద్యార్థి ఉద్యమంలోకి తీసుకువచ్చారన్నారు. ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి వ్యతిరేకంగా కామ్రేడ్ యర్రోజు మాధవాచార్యులు గారి నాయకత్వంలో ఏర్పడిన డి ఎస్ ఎస్ లో క్రియాశీలకంగా పని చేశారన్నారు. ఈ కాలంలోనే దిగవల్లి గ్రామ కమ్యూనిస్టు పార్టీ శాఖ సభ్యునిగా, శాఖ కార్యదర్శిగా పనిచేశారు. 1952 అక్టోబర్లో భీమవరంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించి నడిపారనీ తెలిపారు. కామ్రేడ్ దాసరి ఉద్యమ స్ఫూర్తి కి పొట్టి శ్రీరాములు గారు స్వయంగా శాంతియుత ఉద్యమాన్ని నిర్వహించమని కోరుతూ ఒక లేఖ రాసి వ్యక్తిగతంగా కూడా మాట్లాడారనీ తెలిపారు. ఆ తరువాత ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై కలకత్తా కేంద్రంగా విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి పూనుకున్నారన్నారు. 1955లో నూజివీడు తాలూకా కమ్యూనిస్టు పార్టీ నాలుగో మహాసభలో కార్యదర్శిగా ఎన్నికైన దాసరి ఊరు ఊరు తిరిగి శ్రమజీవులను సమీకరించి పలుభూ పోరాటాలకు నాయకత్వం వహించి వేలాది ఎకరాల బంజర భూములను భూస్వాముల, జమీందారుల, ముఖాసాదారుల పేడనకు వ్యతిరేకంగా పోరాడి పంపిణీ చేశారు.1964 తర్వాత కృష్ణాజిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి ఉద్యమస్పూర్తికి దాసరి విశేషమైన కృషి చేశారు. ఆ తరువాత రాష్ట్ర కమ్యూనిస్టు సమితి కార్యదర్శి వర్గ సభ్యునిగా, ప్రత్యేక పరిస్థితులలో విజయవాడ నగర కమ్యూనిస్టు సమితి కార్యదర్శిగా కొంతకాలం పనిచేశారు. తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిస్టు సమితి కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శి వర్గ సభ్యునిగా పనిచేశారు. 1955 నుండి 1962 సంవత్సరాలలో నూజివీడు శాసనసభకు ఎంఆర్ అప్పారావు గారిపై పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 1971, 1977, 1980 సంవత్సరాలలో విజయవాడ పార్లమెంటుకు దాసరి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఉద్దండులైన కేఎల్ రావు, చెన్నుపాటి విద్య వంటి వారిని ఎదుర్కొన్నారు . 1998 మార్చిలో రాష్ట్ర శాసనసభ నుండి రాజ్యసభకు పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం తోడ్పడుతో దాసరి గారు ఎన్నికయి ఆరు సంవత్సరాలు ఈ పదవిలో ఉన్నారు .ఈ కాలంలో ఎంపీ నిధులను గ్రామ గ్రామాన పేద వర్గాల ప్రయోజనాల కోసం ఉపయోగించారు. ఎంపీ నిధులను ఎలా ప్రజా ప్రయోజనాలకు ఖర్చు పెట్టాలో ఆదర్శంగా చేసి చూపించారు. స్వర్గీయ చంద్ర రాజేశ్వరరావు గారి పేర హైదరాబాదులో సిఆర్ వృద్ధాశ్రమాన్ని, నూజివీడులో పార్టీ కార్యాలయం అమర్ భవన్, విజయనగరం, శ్రీకాకుళం పార్టీ కార్యాలయం, స్వగ్రామం దిగవల్లి లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించడంలో దాసరి విశేషమైన కృషి చేశారు. చివరి రోజుల్లో తన యావదాస్తిని, కొబ్బరి తోటను పార్టీకి, పార్టీ ప్రజా సంఘాలకు ఇస్తూ వీలునామా రాశారు. తన భార్య లక్ష్మి పుట్టింటి నుండి వచ్చిన ఆస్తులు అమ్మగా వచ్చిన 30 లక్షల రూపాయలను నూజివీడు పార్టీ నేతృత్వంలో దాసరి లక్ష్మీ మహిళా సదన్ పేరా ఒక పార్టీ భవనాన్ని నిర్మించి పార్టీకి అందజేశారు. ఆ భవన నిర్మాణం జరుగుతున్న కాలంలోనే 2008 ఏప్రిల్ 27వ తేదీన హైదరాబాద్ సిఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో దాసరి గారు మరణించారు. ఆనాడు ఆయన అందించిన త్యాగాలు, ఆశయాల స్ఫూర్తితో ఈనాటికీ జిల్లాలో మరిన్ని ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు.