విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 13 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లాలోని వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించి, పోలీసు స్టేషనుల్లో నమోదైన క్రిమినల్ కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి, నూతన చట్టాలకు అనుగుణంగా నిర్ధిష్ట కాల పరిమితిలో నిందితులపై సంబంధిత న్యాయ స్థానాల్లో అభియోగ పత్రాలు దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆగస్టు 12న అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ - నూతన క్రిమినల్ చట్టాలకు అనుగుణంగా 10సం.లు కంటే ఎక్కువగా శిక్షలు విధించే క్రిమినల్ కేసుల్లో 90రోజుల్లోను, అంతకంటే తక్కువ కాలం శిక్షలు విధించే కేసుల్లో 60రోజుల్లోగా నిందితులపై సంబంధిత న్యాయ స్థానాల్లో అభియోగ పత్రాలు దాఖలు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. వివిధ పోలీసు స్టేషనులు పరిధిలో దర్యాప్తులోగల గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, ఆయా కేసుల్లో దర్యాప్తు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ కేసుల్లో దర్యాప్తు పెండింగులో ఉండుటకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకొని, దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, అభియోగ పత్రాలు దాఖలు చేయాలన్నారు. దర్యాప్తు పెండింగులో ఉన్న కేసుల్లో సంబంధిత మెడికల్ ఆఫీసరు, రెవెన్యూ అధికారులు, రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి పెండింగులో ఉన్న రిపోర్టులు, నివేదికలను త్వరితగతిన పొందాలన్నారు.ఇందుకు అవసరమైతే ప్రత్యేకంగా ఒక అధికారిని లేదా సిబ్బందిని నియమించి, సంబంధిత అధికారుల నుండి నివేదికలు, రిపోర్టులను పొందాలన్నారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఈ సాక్ష్య యాప్ లోను, సి.సి.టి.ఎన్.ఎస్.లోను అప్లోడు చెయ్యాలని దర్యాప్తు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోక్సో కేసుల్లో బాధితురాలి వయస్సును నిర్ధారించేందుకు ఇకపై పంచాయతీ, మున్సిపల్ ఆఫీసుల నుండి జారీ చేసిన నిర్ధారణ పత్రాలను మాత్రమే ప్రామాణికం గా తీసుకోవాలన్నారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేసే ముందు కేసులకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నవి లేనిది పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. న్యాయస్థానాల్లో ప్రాసిక్యూషను పూర్తి చేసేందుకు ఈ-సమన్స్ ను త్వరితగతిన అమలు చేయాలన్నారు. దర్యాప్తు అధికారులు తరుచూ న్యాయ స్థానాలకు వెళ్ళి,ప్రాసిక్యూషను సక్రమంగా జరుగుతున్నది లేనిది, నిందితులు కోర్టులకు సక్రమంగా హాజరవుతున్నది లేనిది పరిశీలించాలన్నారు. నిందితులు శిక్షింపబడే విధంగా సాక్ష్యాలను దాఖలు చేయాలని, సాక్షులు తమ సాక్ష్యాన్ని న్యాయ స్థానాల్లో చెప్పే విధంగా చూడాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జందల్ ఆదేశించారు ఈ జూమ్ కాన్ఫరెన్సులో అదనవు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, పలువురు సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.