
బుద్ధవనం సందర్శించిన ఉత్తరప్రదేశ్ టూరిజం ప్రతినిధులు
జనం న్యూస్- ఆగస్టు 19- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ లో తెలంగాణ టూరిజం అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనాన్ని ఉత్తరప్రదేశ్ పర్యాటక రంగానికి చెందిన ప్రతినిధులు మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కౌశాంభి జిల్లాలో ఉత్తరప్రదేశ్ టూరిజం నాగార్జునసాగర్ లోని బుద్ధవనం తరహాలో సుమారు 10 ఎకరాలలో బుద్ధుని జీవితాన్ని తెలిపే బుద్ధ థీమ్ పార్క్ పార్కును నిర్మించడానికి ప్రక్రియ ప్రారంభించనున్నది. దీనికై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం టూరిజం ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ ప్రాజెక్టుల కార్పోరేషన్ లిమిటెడ్ కంపెనీకి ఈ బాధ్యతలను అప్పజెప్పింది. ఈ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శైలేంద్ర సింగ్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం బుద్ధవనం సందర్శించి బుద్ధ వనములోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దీనిలో భాగంగా బుద్ధ వనంలో బుద్ధ చరిత వనము జాతకవనం ధ్యానవనం,స్తూపవనం మహా స్తూపం,ధ్యాన మందిరము,ఎంట్రన్స్ ప్లాజా మొదలగు విభాగాలను పరిశీలించి వాటి నిర్మాణ శైలిని తెలుసుకున్నారు. అంతకుముందు బుద్ధ వనం చేరుకున్న ఈ నిపుణుల బృందానికి బుధవారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రలు స్వాగతం పలికి బుద్ధవనం శాలువాలతో సత్కరించి మహా స్తూపం లోని బుద్ధ దాతువుల వద్ద బుద్ధ జ్యోతిని వెలిగింప చేశారు. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ టూరిజం తరఫున బుద్దవనం విచ్చేసిన ఉత్తరప్రదేశ్ ప్రాజెక్టుల కార్పొరేషన్ కోఆర్డినేటర్ శైలేందర్ సింగ్ మాట్లాడుతూ సిద్ధార్థుడు మూడు సంవత్సరాల పాటు ఉత్తరప్రదేశ్లోని యమునా నది తీరాన కౌశాంబి ప్రాంతంలో జ్ఞానసిద్ధికై తపస్సు చేశారని, అంత ప్రసిద్ధమైన ప్రదేశంలో బుద్ధిష్టు థీమ్ పార్క్ పది ఎకరాల వైశాల్యంలో మొదటగా ప్రారంభించినట్లుగా తెలిపారు. దీనిలో తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ లో ఉన్న బుద్ధమనం ప్రాజెక్టును మోడల్ గా తీసుకొని బుద్ధ చరిత వనం, జాతకవనం, స్థూప వనం,ధ్యానవనం,మహాస్తూపాన్ని, ఎంట్రన్స్ ప్లాజా ను ఆకర్షనీయంగా నిర్మించనున్నట్లుగా తెలిపారు. మొదటగా 80 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించి వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెల వరకు పూర్తి చేసి బుద్ధ పూర్ణిమ నాటికి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. తనతోపాటు ఆర్కిటెక్చర్ రాహుల్, ఇంజనీర్ కళ్యాణ్ చంద్ర, స్తపతి గిరీష్ తివారిలు బుద్ధవనం పరిశీలనకు వచ్చామన్నారు. వీరితోపాటు స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.