జనంన్యూస్ 22. నిజామాబాద్,రూరల్.
మారుమూల, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని పాల్ద గ్రామంలో పనుల జాతరలో భాగంగా 12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న అంగన్వాడి భవన నిర్మాణానికి శుక్రవారం కలెక్టర్ ఆర్.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు. డిచ్ పల్లి మండలం ముల్లంగి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఒడ్డెన్న అనే రైతుకు మంజూరు చేసిన పశువుల కొట్టం నిర్మాణానికి కలెక్టర్ ఆర్.వినయ్ కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాల్ద గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు, డ్రైనేజీలు, సోక్ పిట్స్, అంగన్వాడి భవనాలు, పశువుల కొట్టాలు, కోళ్ల ఫారాలు, గొర్రెల షెడ్లు వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఒక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోనే 33 అంగన్వాడి భవనాలను ఏకకాలంలో చేపట్టడం జరుగుతోందని వివరించారు. పేదల సంక్షేమం, పల్లెల అభివృద్దే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తున్నామని, ఇంటి నిర్మాణం చేపట్టిన వారికి సకాలంలో బిల్లులు మంజూరు చేస్తున్నామని అన్నారు. బిల్లుల కోసం ఎవరు కూడా మధ్యవర్తులను ఆశ్రయించకూడదని, పైరవీలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం నేరుగా లబ్దిదారుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తోందని అన్నారు. గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కూడా అర్హులకు కేటాయిస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారత దిశగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారని, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులు, సోలార్ విద్యుత్ యూనిట్లు, క్యాంటీన్ లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, మహిళా మార్ట్ లు తదితర వాటిని కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా రైతు భరోసా, రైతు బీమా, కనీస మద్దతు ధరకు పంటల కొనుగోలు, ఎరువులు, విత్తనాల పంపిణీ చేస్తున్నామని అన్నారు. సమాజంలో నిరుపేదలు కూడా గౌరవప్రదమైన జీవనాలు వెళ్ళదీయాలని రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నామని, అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని అన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించాలని, తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలువాలని కోరారు.కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఆయా వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక నూతన కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తోందని అన్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూభారతి కొత్త చట్టం రూపొందించి విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తు చేశారు. గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలపై రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేపడుతూ పరిష్కరించడం జరుగుతోందన్నారు. కొత్తగా రూపొందించిన భూభారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థతో పాటు సాదా బైనామా, పీ.ఓ.టీ భూములకు సంబంధించిన సమస్యలను సైతం పరిష్కరించేలా మార్గదర్శకాలను చేర్చిందని తెలిపారు. హైకోర్టు వెలువరించే ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఇల్లు మంజూరైన లబ్దిదారులకు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తున్నామని తెలిపారు. లబ్దిదారులైన మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం సెర్ప్, మెప్మాల ద్వారా రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో రూ. 50.95 కోట్ల రుణాలు మంజూరు చేశామని వివరించారు. కాగా, లబ్దిదారులు అనవసర ఆడంబరాలకు పోయి గృహ నిర్మాణం వ్యయాన్ని పెంచుకుని అప్పుల ఊబిలో కూరుకుపోకూడదని ఈ సందర్భంగా కలెక్టర్ హితవు పలికారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో రానున్న వారం పది రోజులలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పనుల జాతరలో భాగంగా గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనులను విరివిగా చేపడుతూ, గ్రామాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమాలలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి శంకర్, స్థానిక అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.