
జనం న్యూస్ 25 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఈ నెల 27న జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసుకొనే గణేష్ పందిళ్ళు, మండపాలు ఏర్పాటుకు తప్పనిసరిగా సంబంధిత శాఖకు నుండి అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ఆగస్టు 24న ఒక ప్రకటనలో కోరారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ- వినాయక ఉత్సవాలను శాంతియుతంగా ఎటువంటి అల్లర్లు, ఘర్షణలకు తావు లేకుండా నిర్వహించు కోవడానికి పోలీసుశాఖకు ప్రజలందరూ సహకరించాలని, ఉత్సవాలను సాఫీగా నిర్వహించేందుకు పోలీసుశాఖ ఆంక్షలను, సూచనలను పాటించాలని కోరారు. వినాయక ఉత్సవాలు నిర్వహించే వారు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సింగిల్ విండో విధానంతో https://ganeshutsav.net లాగిన్ అయి, నిర్దేశించిన అనుమతులు ఎటువంటి రుసుము చెల్లించకుండా పొందొచ్చని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో ప్రతీ ఒక్కరూ మతసామరస్యాన్ని పాటించాలని, ఇతర మతాల వారికి ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా కమిటీ సభ్యులు బాధ్యత వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు నిర్వహించరాదన్నారు. ఉత్సవాలను ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించినట్లయితే సంబంధిత పంచాయతీ లేదా మున్సిపల్ అధికారుల నుండి అనుమతులు పొందాలన్నారు. అదే విధంగా మండపాలను ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేస్తే సంబంధిత స్థల యజమానుల నుండి ముందుగా అనుమతులు పొందాలన్నారు. ఉత్సవాల నిర్వహణకు ఎలక్ట్రికల్ మరియు ఫైర్ శాఖల అనుమతులు కూడా పొందాలన్నారు. ఉత్సవాలు నిర్వహించే ప్రాంతంలో వాహనాల రాకపోకలకు ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా చూడాలన్నారు. ఉత్సవాల్లో డి.జే.లను వినియోగించేందుకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. మైకులు, సౌండ్ బాక్సుల వినియోగంతో ప్రజలకు ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. మైకులను నిర్దేశించిన సమయం, సౌండు వరకు మాత్రమే వినియోగించాలని సంబంధిత అధికారుల నుండి అనుమతులు పొందాలన్నారు. ఉత్సవాల నిర్వహణకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదని స్పష్టం చేసారు. ఉత్సవాలు నిర్వహించే ప్రాంతంలో కమిటీ సభ్యులు 24/7లో అందుబాటులో ఉండాలని, సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాల్లో రాత్రి సమయాల్లో దీపారాధన వలన ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని, ప్రమాదాల నియంత్రణకు మండపాల వద్ద ఇసుక, నీరు అందుబాటులో ఉంచాలన్నారు. నిమజ్జనం నిర్వహించే సమయంలో ప్రమాదకరమైన రంగులు జల్లుకోవడం ప్రేలుడు, బాణాసంచా కాల్చడం నిషిద్ధమని, ఉత్సవాల్లో ఎటువంటి బాణాసంచాను వినియోగించకుండా చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులను జిల్లా ఎస్పీ కోరారు. ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, రికార్డింగు డాన్సులు నిర్వహించినా, ఊరేగింపుల్లో డి.జేలు, బాణాసంచా వినియోగించినా, నిబంధనలు అతిక్రమించినా చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు.