వరద నీటి ధాటికి తెగిన చిన్న పూల్ వంతెన
వరద నీటితో నవోదయ,మోడల్ స్కూల్ కు నిలిచిన రాకపోకలు
భయాందోళనలో తల్లిదండ్రులు
జుక్కల్ ఆగస్టు 28 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి నిజాంసాగర్ ప్రాజెక్టు వరద పోటు తాకింది.ఏకంగా 2 లక్షలకు పైగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతుంది. పోచారం,సింగూర్, హల్దీ వాగు పొంగి పొర్లడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు 27 వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు మంజీర నదిలోకి 2లక్షల 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల గ్రామాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రతి గంటగంటకు ఇన్ ఫ్లో పెరగటంతో మంజీర పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి నిజాంసాగర్ మండలం జలమయమైంది. బొగ్గు గుడిసె వద్ద 9 మంది కూలీలు వరదల్లో చిక్కుకోగా రెస్క్యూ టీమ్ 5 గురుని సురక్షితంగా రక్షించారు.మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం1405.00అడుగులు కాగా ప్రస్తుతం 1404.30అడుగుల నీరు నిల్వ ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.790 టీఏంసిలు నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుండి 2 లక్షల 8 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. వైర్ నెంబర్ 5 వరద గేట్ల నుండి 8 వరద గేట్లను ఎత్తి 62,519 క్యూసెక్కులు, వైర్ నెంబర్ 4వరద గేట్ల నుండి 10 వరద గేట్లను ఎత్తి 93,520 క్యూసెక్కులు, 20 వెంట్ బెడ్ రెగ్యులేటర్ నుండి 9 వరద గేట్లను ఎత్తి 64,217 క్యూసెక్కుల నీటిని దిగువకు మంజీర నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో నిజాంసాగర్ సమీపంలో గల నవోదయ,మోడల్ స్కూల్ విద్యార్థులు హాస్టల్ లో చిక్కుకున్నారు. వరద పోటు భారీగా పెరగటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా చిన్న పూల్ వంతెన వరద ధాటికి తెగిపోయినట్లు సంచారం. అధికారులు స్పందించి నవోదయ,మోడల్ స్కూల్ విద్యార్థులను సురక్షితంగా తరలించాలని తల్లి దండ్రులు వేడుకుంటున్నారు.