జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగష్టు 29
వ్యవహారిక భాషా పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి జన్మదిన సందర్భంగా ఈరోజు తర్లుపాడు మండలం జగన్నాధపురం పాఠశాలలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కశ్శెట్టి. జగన్ బాబు మాట్లాడుతూ గిడుగు వెంకట రామ్మూర్తి శ్రీకాకుళం జిల్లా పర్వతాల పేటలో జన్మించారు .వారి తండ్రి పేరు వీర్రాజు తల్లి పేరు వెంకమ్మ. గిడుగు చిన్నవయసులో ఉన్నప్పుడు తండ్రి మరణించడంతో మేనమామ ఇంట్లో ఉండి అభ్యసించారు. పాఠశాల రోజుల్లోనే ముఖలింగ దేవాలయం శాసనాలను సొంతంగా చదివి అర్థం చేసుకున్నారు. గిడుగు రచయితగా,చరిత్రకారుడుగా, సంఘసంస్కర్తగా, వాడుక భాష ఉద్యమకర్తగా పేరు పొందారు. గిడుగు సవరుల భాషకు కొత్తగా లిపిని సమకూర్చారు. గిడుగు కృషి కారణంగా 1912 -13 లో స్కూల్ ఫైనల్ బోర్డు తెలుగు వ్యాస పరీక్షను వ్యవహారిక భాషలో కూడా రాయడానికి అవకాశం కలిగింది. 1913లో గిడుగు బ్రిటిష్ ప్రభుత్వం చే ‘రావు బహదూర్’ బిరుదు పొందారు. రామ్మూర్తి ఇంగ్లీషులో సవర భాష వ్యాకరణాన్ని, సవర -ఇంగ్లీష్ కోశాన్ని తయారు చేశారు. 1919లో గ్రాంథికవాదుల ఆక్షేపణలను తిప్పి కొట్టాలని తెలుగు మాసపత్రికను ,1936లో ప్రతిభ అనే సాహిత్య పత్రికను ప్రారంభించారు. 1919లో గిడుగు కార్యదర్శిగా, కందుకూరు వీరేశలింగం అధ్యక్షుడిగా వర్తమానా ఆంధ్రభాష ప్రవర్తక సమాజం ఏర్పడింది. గిడుగు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి’ కళా ప్రపూర్ణ ‘బిరుదు పొందారు.గిడుగు తెలుగు వ్యవహారిక భాష ఉద్యమాన్ని లేవదీసి వ్యవహారిక భాష ఉద్యమ పితామడిగా పేరుపొందారు. గిడుగు రామ్మూర్తి జనవరి 22 1940 మరణించారు. గిడుగు రామ్మూర్తి జన్మదినాన్ని ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం గా జరుపుకుంటారు అని ఆ మహనీయుడు గురించి జగన్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని యం అనూష మరియు విద్యార్థులు పాల్గొన్నారు.