జనం న్యూస్ 29 ఆగస్టు వికారాబాద్ జిల్లా.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల తండాలలో నివసించే వృద్ధులు, వికలాంగులు పింఛన్ పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జి.బి.హెచ్.ఎస్.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వినోద్ జాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తండా నుండి గ్రామపంచాయతీ కార్యాలయం చాలా దూరంగా ఉండటంతో, వృద్ధులు, వికలాంగులు ప్రతీ నెలా పింఛన్ కోసం ఎటూ ఇటూ తిరగాల్సి వస్తోందని ఆయన అన్నారు. అధిక వయస్సు, శారీరక సమస్యలు ఉన్నవారు కిలోమీటర్ల దూరం ప్రయాణించడం చాలా కష్టసాధ్యమని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి, రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల తండాలలో నివసించే వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు వారి ఇంటి వద్దకే చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వినోద్ జాదవ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్న నేపథ్యంలో, పింఛన్లు కూడా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరే విధంగా చర్యలు తీసుకుంటే వృద్ధులు, వికలాంగులకు పెద్ద ఊరటనిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పేద ప్రజల పట్ల సహానుభూతితో ముందుకు వచ్చి, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆయన కోరారు.