విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 30 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా మహిళా పోలీసు స్టేషనులో 2024 సం.లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విజయనగరం పట్టణం హుకుంపేటకు చెందిన పెంకి వివేక్ (25 సం.లు) అనే వ్యక్తికి విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.4,000/- లు జరిమానా విధిస్తూ ఆగస్టు 29న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం జిల్లా పట్టణం హుకుంపేటకు చెందిన పెంకి వివేక్ (25 సం.లు) అనే వ్యక్తికి విజయనగరం పట్టణంకు చెందిన మైనరు బాలిక (14 సం.లు) మరియు ఆమె తల్లిదండ్రులు అంబటిసత్రం వద్దగల చర్చికి వెళ్ళే సమయంలో పరిచయం అయ్యారు. మైనరు బాలిక ఆరోగ్యం తరుచూ బాగుండక పోవడంతో నిందితుడు వారింటికి వెళ్ళి, సహాయపడేవాడన్నారు. ఈ క్రమంలో మైనరు బాలిక తల్లిదండ్రులను నిందితుడు పెంకి వివేక్ పూర్తిగా నమ్మించి, మైనరు బాలికను ఒంటరిగా కొద్ది రోజులు వేరేగా ఉంచితే, ఆమె ఆరోగ్యం కుదుట పడుతుందని నమ్మించారన్నారు. ఒక పథకం ప్రకారం మైనరు బాలికను అంబటివలసలో ఒక ఇల్లు తీసి పెట్టి, మైనరు బాలిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నట్లుగా నిందితుడు పెంకి వివేక్ అందరిని నమ్మించి, ఆమెను లోబర్చుకొని, ఆమెను శారీరకంగా అనుభవించి, కొన్ని వీడియోలు, ఫోటోలు తీసి, మైనరు బాలికను భయపెట్టేవారన్నారు. విషయం మైనరు బాలిక తల్లికి తెలిసి విజయనగరం మహిళా పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ ఎన్.పద్మావతి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.ఈ కేసు దర్యాప్తును అప్పటి మహిళా పిఎస్ ఇన్చార్జ్ డిఎస్పీ డి.విశ్వనాధ్ చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించి, నిందితుడిపై అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. కేసు నమోదైన సంవత్సరన్నర కాలంలోనే ప్రాసిక్యూషను పూర్తయ్యే విధంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో ప్రస్తుత డిఎస్పీ ఆర్.గోవిందరావు చర్యలు చేపట్టారన్నారు. న్యాయస్థానంలో నిందితుడు పెంకి వివేక్ (25 సం.లు)పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి గారు నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగారం మరియు రూ.4,000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షల మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసుల తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు మెట్టా ఖజానారావు వాదనలు వినిపించగా, డీఎస్పీ ఆర్.గోవిందరావు పర్యవేక్షణలో సి.ఎం.ఎస్. హెచ్సీ సిహెచ్.రామకృష్ణ, మహిళా పీఎస్ హెచ్సీ కే.అప్పల నాయుడు,మహిళా పిఎస్ కోర్టు కానిస్టేబులు సూరపు నాయుడు సాక్షులను బ్రీఫ్ చేసి, సకాలంలో కోర్టులో హాజరు పర్చారన్నారు.ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టిన జుడిషియల్, పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.