భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావ్ వ్యాఖ్యలకు గోర్ బంజారా హక్కుల సాధన సమితి సంఘం తీవ్ర వ్యతిరేకత.
జనం న్యూస్ 31 ఆగస్టు వికారాబాద్ జిల్లా.
తెలంగాణలో ఎస్టి జాబితా నుంచి కొన్ని వర్గాలను తొలగించాలని భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావ్ చేసిన వ్యాఖ్యలకు గోర్ బంజారా హక్కుల సాధన సమితి సంఘం తీవ్రంగా స్పందించింది. బంజారాలను ఎస్టి జాబితా నుంచి తొలగించాలన్న డిమాండ్ పూర్తిగా అన్యాయం మరియు అప్రజాస్వామ్యమని సంఘం నాయకులు స్పష్టం చేశారు.సంఘం రాష్ట్ర అధ్యక్షులు వినోద్ జాదవ్ మాట్లాడుతూ – "1976లోనే కేంద్ర ప్రభుత్వం గిరిజనుల జీవన విధానం, వెనుకబాటుతనం, సామాజిక పరిస్థితులను బట్టి బంజారాలను ఎస్టి జాబితాలో చేర్చింది. ఇది చారిత్రకంగా సరైన నిర్ణయం. ఇప్పుడు దానిని ప్రశ్నించడం అంటే గిరిజన సమాజాన్ని మళ్లీ వెనుకకు నెట్టే ప్రయత్నమే" అని పేర్కొన్నారు.అలాగే, "వెనుకబడిన గిరిజనులకు ఇచ్చిన హక్కులను తీసివేయాలని డిమాండ్ చేయడం బంజారా సమాజాన్ని విభజించే ప్రయత్నం. భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావ్ వంటి నాయకులు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి తప్ప కలహాలు రేపకూడదు" అని అన్నారు. ప్రభుత్వం తప్పుడు వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఎస్ టి హక్కులను కాపాడకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి తండా సేవలాల్ కమిటీ సభ్యులు భారీ ఎత్తున ధర్నాలు చేస్తారని గోర్ బంజారా హక్కుల సాధన సమితి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వినోద్ జాదవ్, ఉపాధ్యక్షులు వీరేందర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో లంబాడా హక్కుల పోరాట సమితిరాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్ పాల్గొని సంఘానికి మద్దతు తెలిపారు.