అధికారులకు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం..!
జనంన్యూస్. 04. సిరికొండ.ప్రతినిధి.
వరద తాకిడికి కొట్టుకుపోయిన రోడ్లు, కూలిన వంతెనల పరిశీలన ఇటీవల జిల్లాలో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిన ప్రాంతాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం సందర్శించారు. ఇందల్వాయి – భీంగల్ ప్రధాన మార్గంలో ధర్పల్లి మండలం పాటితండా వద్ద వరద ప్రవాహానికి దెబ్బతిన్న వంతెనను పరిశీలించారు. అదేవిధంగా సిరికొండ మండలం కొండూర్ శివారులో వరద తాకిడి వల్ల దాదాపు కిలోమీటరు వరకు పెద్ద ఎత్తున దెబ్బతిన్న బీ.టీ రోడ్డును, కూలిన హైలెవెల్ బ్రిడ్జి, చెక్ డ్యాంలను పరిశీలించారు. నీట మునిగిన పంటలు, కూలిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన కరెంటు తీగలు, ఇసుక మేటలు వేసిన వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారి కొట్టుకుపోయి, బ్రిడ్జి కూలిపోవడంతో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్నందున ఈ మార్గం గుండా వాహనాల రాకపోకలు కొనసాగకుండా కట్టడి చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. తక్షణమే చేపట్టాల్సిన పనుల జాబితాలో కొండూరు రోడ్డు మార్గాన్ని చేర్చి, వెంటనే సౌకర్యాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ వంటి వసతులను సాధ్యమైనంత త్వరగా తిరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చొరవ చూపాలన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన తక్షణమే చేపట్టాల్సిన పనులను, శాశ్వత ప్రాతిపదికన జరిపించాల్సిన పనులను వేర్వేరుగా విభజించుకుని ప్రాధాన్యతా క్రమంలో వాటిని చేపట్టేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. అనంతరం పెద్దవాల్గోట్ గ్రామంలో కొనసాగుతున్న రోడ్డు పునరుద్ధరణ పనులను కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనల వల్ల ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అధికారులు, సిబ్బంది అందరూ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. స్థానిక రైతులు, ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ, వరద నష్టంపై సమగ్ర వివరాలతో కూడిన నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని అన్నారు. విద్యుత్, రవాణా, మంచినీటి సరఫరా వంటి వసతులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఈ.ఈ శంకర్ నాయక్, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, తహసిల్దార్ రవీందర్ రావు, ఆర్ అండ్ బీ ఏ.ఈ గంగాధర్ తదితరులు ఉన్నారు.