భారతదేశ దిగుమతుల పైన అమెరికా విధిస్తున్న 50 శాతం సుంకాలను వ్యతిరేకించాలని వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నాగేంద్రబాబు సిపిఎం నాయకులు రియాజ్ లు మాట్లాడుతూ దిగుమతుల పట్ల అమెరికా విధిస్తున్న పన్నులు దుర్మార్గమని అయినా అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం ట్రంప్ విధానాలను ఎందుకు వ్యతిరేకించలేకపోతుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా మారిన మోడీ మౌనం దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాల వల్ల భారతదేశంలోని ప్రధాన ఆదాయ వనరులైన ఆక్వా రంగం టెక్స్ టైల్ రంగం తో పాటు అనేక రంగాలు కుదేలైపోతున్నాయని, ప్రధాని మరియు ఆర్థిక మంత్రులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. నిత్యవసర సరుకుల ధరల మీద జిఎస్టిని తగ్గించకపోతే ప్రజలు కొనుగోలు సామర్థ్యాన్ని కోల్పోతారని కమ్యూనిస్టులు ఎప్పటినుంచో చెప్తున్నా వారి మాటలు పెడచెవిన పెట్టి ఈ రోజున మళ్ళీ ఆర్థిక రంగంలో ఏర్పడినటువంటి అవకతవకలను సరిచేసుకునేందుకు జీఎస్టీ ని తగ్గిస్తామని చెప్పడం ప్రభుత్వానికి దార్శనికత లేదని తెలియజేస్తుందన్నారు.
కమ్యూనిస్టులను చైనా రష్యాలకు తొత్తులుగా విమర్శించే మిథ్యా దేశ భక్తులకు ఈ రోజున వారి సహకారం లేకపోతే భారత ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేయాలని హితవు పలికారు. ఎప్పటికైనా భారతదేశానికి శాశ్వత మిత్రులు సోషలిస్ట్ దేశాలని అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలు కాదని ఇకనైనా మోడీ ప్రభుత్వం మౌనము వీడి ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడాలని తద్వారా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు తొండ రమణయ్య, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బాలు, సిపిఎం నాయకులు భాస్కర్, చంద్ర, ఏఐటీయూసీ నాయకులు బాబు, నాగరాజు, పాలెయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.