జనం న్యూస్:- రాష్ట్రంలో మహిళలు, యువతులపై అరాచకాలు ఆగడం లేదు. పండు ముసలి నుంచి ముక్కుపచ్చలారని చిన్నారులపై కామాంధుల అకృత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. కోర్టుల కఠిన శిక్షలు విధించినా.. తమకేం పట్టనట్టుగా మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా నరసరావు పేటలోని ఏఎం రెడ్డి కాలేజీ లో గ్రీష్మ అనే యువతి బీ ఫార్మసీ చదువుతోంది. ఈ క్రమలోనే గ్రీష్మకు మల్లికార్జున్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే, వారి పరిచయం కాస్త కొన్నాళ్లకు ప్రేమగా మారింది. కానీ, ఇటీవల కాలంలో గ్రీష్మ మరో యువకుడితో మాట్లాడుతోందని మల్లికార్జున్ అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైన గ్రీష్మను అంతమొదించాలని నిర్ణయించుకుని తనతో మాట్లాడేది ఉందని చెప్పి గుత్తికొండ సమీపంలోని అటవీ ప్రాంతానికి రమ్మని ఫోన్ చేశాడు. అది నమ్మిన గ్రీష్మ అక్కడికి వెళ్లగా మల్లికార్జున్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. మాటమాట పెరిగి విచక్షణ కోల్పొయిన మల్లిఖార్జున కర్రతో గ్రీష్మపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో గ్రీష్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పెద్ద ఎత్తున కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన విషయాన్ని వారికి చెప్పడంతో ప్రియుడు మల్లికార్జున్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం గ్రీష్మను చికిత్స కోసం నరసరావు పేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.