
జనం న్యూస్ 30 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలం:కొత్త రాజోలిలోని కొత్త తుమ్మలపల్లికి వెళ్లే రహదారి వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు ఒక భయానక అనుభవంగా మారుతోంది. రోడ్డు పూర్తిగా బురదమయమై, ఎక్కడికక్కడ గుంతలు, మురికినీరు పేరుకుపోయి ప్రయాణం ప్రమాదకరంగా మారింది.ప్రజలు ఆ బురదలో నడుస్తూ తరచూ కింద పడుతున్నారు. ఈరోజు కూడా ఒక వ్యక్తి కింద పడి తీవ్రంగా గాయపడిన ఘటన గ్రామంలో ఆగ్రహాన్ని రగిలించింది.గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ “ప్రజల ప్రాణాలు పోతే కానీ నాయకులు స్పందించరా? ఓట్లు అడిగేటప్పుడు వస్తారు కానీ రోడ్డు సరిచేయడంలో మాత్రం ఎవరూ కనబడరు”అంటూ మండిపడుతున్నారు.అధికార పార్టీకి చెందిన నాయకుడు “నాకు ఓటు వేసారా?” అని స్పందిస్తే,
గెలిచిన ఎమ్మెల్యే “నేనేమైనా అధికార పార్టీలో ఉన్నానా?” అని పక్కకు తప్పించుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన నాయకులు ఇప్పుడు ప్రజల కష్టాలపై నిశ్శబ్దంగా ఉండటం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.“నాయకులకు ప్రజల ఓట్లు కావాలి కానీ ప్రజల ప్రాణాలపై ప్రేమ లేదు. రోడ్ల దుస్థితి వల్ల మనుషులు కిందపడినా, గాయపడినా వీరికి సంబంధం లేదేమో?”
అంటూ గ్రామ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.గ్రామస్థులు వెంటనే రహదారిని మరమ్మతు చేసి, శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులు మరియు ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు.