జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 13
ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన సమాచార హక్కు చట్టం-2005 ప్రజల చేతిలో ఒక వజ్రాయుధం వంటిదని తర్లుపాడు మండల ఇన్చార్జి డిప్యూటీ తహసీల్దార్ ఎస్. లక్ష్మిరెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తర్లుపాడు మండల కేంద్రంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లక్ష్మిరెడ్డి ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు, నిధుల వినియోగం, అభివృద్ధి పనుల వివరాలను తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఈ చట్టం కల్పించిందన్నారు. అవినీతిని అరికట్టడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తుందని, దీనిపై ప్రజలందరూ పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు.మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తోటపల్లి చరణ్ మాట్లాడుతూ, కేవలం ఒక దరఖాస్తు ద్వారా ప్రభుత్వ యంత్రాంగం నుంచి అవసరమైన సమాచారాన్ని ఎలా పొందాలో వివరించారు. ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ సేవల్లో మరింత పారదర్శకతకు ప్రజలు సహకరించాలని కోరారు.తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. సమాచార హక్కు మన హక్కు అవినీతిని అంతమొందిద్దాం పారదర్శకతను పాటిద్దాం వంటి నినాదాలతో క ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు ( వీఆర్వో లు), గ్రామ రెవెన్యూ సహాయకులు వి ఆర్ ఏ లు మరియు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.