
జనం న్యూస్ కాట్రేనికోన, అక్టోబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లా కాట్రేనికోన మండలం దీపావళి పండుగ ముగిసిన వెంటనే వచ్చే అత్యంత పవిత్రమైన నాగుల చవితి పర్వదినాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో, వైభవంగా జరుపుకున్నారు. గ్రామాల్లో ప్రజలు ఉదయం నుంచే నాగేంద్రుడి పూజల్లో మునిగి పోయారు. నాగుల చవితి రోజున నాగ దేవతను పూజిస్తే సమస్త పాపాలు తొలగి, కుటుంబానికి శు భం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నమ్మకంతో వేకువ జాము నుంచే భక్తులు పల్లెలు, పొలాలు, తోటలు, ఖాళీ ప్రదేశాలలో ఉన్న పుట్టల వద్దకు తండోప తండాలుగా తరలివచ్చారు. నాగ దేవతకు భక్తులు సంప్రదాయ బద్దంగా దీపారాధన చేసి,నాగ దేవతకు నైవేద్యాలు సమర్పించారు. ముఖ్యంగా పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించు కోవడం ఈ పూజలో ప్రధానాంశం. పాలతో పాటు, గుడ్లు, చలివిడి, తేగ, బుర్ర గుంజు వంటి వాటిని పుట్టలో వేసి నాగరాజుకు పూజలు నిర్వహించారు. తమ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని భక్తి పారవశ్యంతో వేడుకున్నారు. అనేక మంది మహిళలు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి, తమ కోరికలు నెరవేర్చమని మొక్కులు తీర్చుకున్నారు. పుట్టల వద్ద పెద్దల పూజలు జరుగు తుండగా, చిన్నపిల్లలు బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు.