
జనం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 27 ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి ):
భూమికోసం, ఉక్తికోసం నిజాములను గద్దె దించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అని పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య పేర్కొన్నారు. సోమవారం 57వ డివిజన్లోని హనుమాన్ టెంపుల్ ఎదుట కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సీపీఐ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.జమలయ్య మాట్లాడుతూ — తెలంగాణ సాయుధ పోరాటంలో సీపీఐ నాయకత్వంలో నాలుగున్నర వేల మంది ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాల ఫలితంగానే మూడున్నర వేల గ్రామాలు విముక్తి పొందాయని తెలిపారు. భూసంస్కరణల చట్టం సాధనతో పాటు బ్యాంకుల జాతీయీకరణ, కార్మిక చట్టాల రూపకల్పన వంటి అనేక సంస్కరణలు కమ్యూనిస్టు పార్టీ పోరాటాల ద్వారానే సాధ్యమయ్యాయని గుర్తుచేశారు.1952, 1957లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి టి. బి. విటల్ రావు పార్లమెంటు సభ్యులుగా గెలిచారని, 1981 సమితి ఎన్నికల్లో సీపీఐ 13లో 8 సమితులను గెలుచుకున్న చరిత్ర తనదే అని చెప్పారు.గిరిజనులకు పోడు భూములు దక్కే వరకు పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, ఇటీవల పార్టీ ప్రతినిధి బృందం దుమ్మగూడెం నుండి గోదావరి నీటిని పాలేరు జలాశయానికి అనుసంధానించే ప్రాజెక్టు కోసం నిరంతర పోరాటం జరిపిందని తెలిపారు.దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు — ఎల్ఐసీ, బ్యాంకులు, టెలికం, గనులు, రక్షణ రంగ పరిశ్రమలు — ప్రైవేటీకరణకు గురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా దేశ సంపదను ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్ పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారని విమర్శించారు.డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనున్న ఐదు లక్షల మందితో కూడిన బహిరంగ సభను విజయవంతం చేయాలని, అందరూ విరాళాలు అందించి సభలో పాల్గొని సీపీఐ బలాన్ని చాటాలని జమలయ్య పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ ఎం.డి. యూసుఫ్, సహారా బేగం, బత్తుల సురేష్, పోలోజు సత్యనారాయణ చారి, చల్లా భాస్కర్, కత్తెర రవీందర్, దాసరి కుమార్, బండి రాములు, అబ్దుల్ రహిమాన్, రామస్వామి, ధర్మయ్య, శివ మౌలానాతో పాటు అనేక మంది మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.