
జనం న్యూస్ 28 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్.,ఆదేశాల మేరకు పోలీస్ కళా బృందం వారు గద్వాల్ రూరల్ ఎస్సై సి.హెచ్. శ్రీకాంత్ ఆధ్వర్యంలో అనంతపురం గ్రామ ప్రజలకు సామజిక అంశాల పై అవగాహనా కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా, పోలీస్ కళాబృందం సభ్యులు ప్రజలకు డయల్ -100, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలు, పోక్సో చట్టం, మరియు సీసీ కెమెరాల ఉపయోగాలు వంటి అంశాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు ఏ ఆపద వచ్చినా తక్షణమే డయల్ -100 కు కాల్ చేయాలని, కాల్ చేసిన వెంటనే సమీపంలో ఉన్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది కొద్ది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయం అందిస్తారని తెలిపారు. ఇప్పటివరకు డయల్ -100 కు వచ్చిన కాల్స్, వాటి ద్వారా ప్రజలు పొందిన సహాయాన్ని గురించి వివరించారు.అలాగే రోడ్డు భద్రత గురించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని,హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయవద్దని, లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేని వాహనాలను నడపవద్దని చెప్పారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలను నడపకూడదని హెచ్చరించారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు ప్రథమ చికిత్స అందించడం గురించి, అలాగే గ్రామాల్లో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు.సైబర్ నేరాల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఎవరైనా మోసాలకు గురైనప్పుడు వెంటనే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. తక్కువ ధరలకు వస్తువులు వస్తాయని నమ్మి మోసపోవద్దని, అలాగే బ్యాంకులు, విద్యుత్ శాఖల నుండి కాల్స్ వస్తున్నాయని చెప్పి ఓటీపీ అడిగితే చెప్పవద్దని స్పష్టం చేశారు. బ్యాంక్ సిబ్బంది ఎప్పుడూ ఓటీపీ వివరాలు అడగరని గుర్తు చేశారు.పోక్సో కేసుల గురించి వివరిస్తూ, మైనర్ బాలికలను వేధిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. అటువంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.చివరగా, సీసీ కెమెరాల ఆవశ్యకతను గుర్తు చేస్తూ, నేరాల నియంత్రణకు అవి ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రజలు తమ కాలనీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే, యువత డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోకూడదని సూచించారు. ఎక్కడైనా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాబృందం సభ్యులు ఎస్ఐ కేశవరావు, రాధమ్మ, రామాంజనేయులు, గ్రామ ప్రజలు, మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.