
జనం న్యూస్ 29 అక్టోబర్ వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా లో మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తమ పరిధిలో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, విద్యుత్, సాగునీటి శాఖల సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, వాగులు, లోకాజ్వేల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే మాత్రమే బయటకు రావాలని స్పీకర్ సూచించారు. రైతులు పత్తి, వరి వంటి పంటలను కాపాడుకునే చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు స్థానిక ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.