
జనం న్యూస్ అక్టోబర్ 29:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము :
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా యువతను డ్రగ్స్ మరియు చెడు వ్యసనాల నుండి దూరంగా ఉంచి, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ పడాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు (అక్టోబర్ 28, 29) తాళ్ల రాంపూర్ గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు.టోర్నమెంట్లో మొత్తం 16 జట్లు వివిధ ప్రాంతాల నుండి పాల్గొని ఉత్సాహభరితంగా పోటీ పడ్డాయి. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ “యువత వ్యసనాల నుండి దూరంగా ఉండి క్రీడల ద్వారా మానసిక, శారీరకంగా బలంగా ఎదగాలి. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు — జీవన విలువలను నేర్పే సాధనాలు కూడా. మంచి స్నేహితులను, మంచి అలవాట్లను ఎంచుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలి” అని అన్నారు.కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా ఏర్గట్ల పోలీస్ స్టేషన్ చేపట్టిన ఈ కబడ్డీ టోర్నమెంట్ను సిపి సాయి చైతన్య సరికొత్త ఆలోచనగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, భీంగల్ సీఐ సత్యనారాయణ గౌడ్, ఏర్గట్ల ఎస్ఐ రాజేశ్వర్, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు మరియు పాల్గొన్న కబడ్డీ జట్లు పాల్గొన్నారు.
