
జనం న్యూస్ కొత్తగూడెం, అక్టోబర్ 30:
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 1న హైదరాబాదులోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించబోయే సదస్సును విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది.కొత్తగూడెం రామ్‌నగర్‌లోని జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ నేతలు మాట్లాడుతూ బీసీ వర్గాలు రాష్ట్రంలో సగానికి పైగా జనాభా కలిగినప్పటికీ, సామాజిక–ఆర్థిక–రాజకీయ రంగాల్లో తమకు తగిన స్థానం దక్కలేదని పేర్కొన్నారు.
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడమే కాకుండా, రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఈ సదస్సు ద్వారా పాలక వర్గాలపై ఒత్తిడి పెంచి, “సామాజిక తెలంగాణ” సాధనకు బీసీ రిజర్వేషన్లు కీలక అడుగుగా నిలుస్తాయని నేతలు పేర్కొన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాథం, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్కే నబిసాహెబ్, జిల్లా అధ్యక్షులు బరగడి దేవదానం, ప్రధాన కార్యదర్శి పగడాల కర్ణాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుప్, జిల్లా ఉపాధ్యక్షులు పాండవుల బిక్షం, పాల్వంచ మండల అధ్యక్షులు బుడగం నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు ఎస్డిటి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.