
జనం న్యూస్:- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. లా అండ్ ఆర్డర్ ఎడిషనల్ డిజి మహేష్ భగవత్ ప్రమాద వివరాలు మీడియాకు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 72 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. బస్ డ్రైవర్ తో సహా మొత్తం 21 మంది మృతి చెందారు. మృతులలో ఎక్కువ మహిళలు ఉన్నారు. 7 మంది మృతులను గుర్తించాం. పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించాం. కొన్ని మృతదేహాలు చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయన్నారు. బస్సు ప్రమాద మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఉస్మానియా ఆస్పత్రి బృందంతోపాటు, గాంధీ ఫోరెన్సిక్ వైద్యులు సైతం పోస్టుమార్టంలో పాల్గొననున్నట్లు తెలిపారు. టిప్పర్ లారీ డ్రైవర్ తప్పిదం వలనే ప్రమాదం జరిగినట్లు కండక్టర్ చెబుతున్నారు. కంకరతో వెళ్తున్న టిప్పర్ లారీ వేగంగా దూసుకు రావడంతో అదుపుతప్పి బస్సును ఢీ కొట్టిందని తెలిపారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. కంకర లోడు బస్సుపై పడిపోవడంతో బస్సులోని ప్రయాణికులు కంకర కింద కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయడ్డారు.