
జనం న్యూస్ నవంబర్ 6 నడిగూడెం
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు స్థాపించి నాలుగు దశాబ్దాలు గడిచిందని ఎంతోమంది విద్యార్థులు గురుకులాల్లో చదువుకుంటూ ఒకవైపు విద్యలో మరోవైపు క్రీడారంగంలో రాణిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నారని అన్ని సొసైటీల విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ భూక్య సక్రు నాయక్ అన్నారు. గురువారం నడిగూడెం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గురుకులాల్లో చదువుకునే అవకాశం కలగడం ఎంతో అదృష్టం అన్నారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వము 1,50,000 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు.కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలను కల్పిస్తూ విద్యార్థుల ఉన్నతికి తోడ్పడుతున్నట్లు పేర్కొన్నారు. గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. అగసార నందిని క్రీడల్లో ఏ స్థాయికి ఎదిగారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ సదరు క్రీడాకారులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు క్రీడల్లో ప్రతిభను కనపరిచేందుకు గాను గురుకుల పాఠశాలల్లో జోనల్ స్థాయి మీట్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గత ఐదు సంవత్సరాలుగా ఛాంపియన్ షిప్ సాధిస్తున్నది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అని అన్నారు.క్రీడా స్ఫూర్తి అవసరం అన్నారు. ఆత్మవిశ్వాసము,క్రీడా స్ఫూర్తి క్రీడాకారులను ఉన్నత స్థాయికి ఎదిగేలా చేస్తుందన్నారు. విద్యార్థుల లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలని కోరారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు క్రమ శిక్షణతో చదువుకోవాలని చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. విద్యార్థులు తమలో ఉన్న ప్రతిభను చాటుకునేందుకు క్రీడల్లో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. గెలుపు, ఓటములను పక్కకు పెట్టి పాల్గొనడం ప్రధానమని భావించాలన్నారు. రాష్ట్రంలో 268 గురుకుల పాఠశాలలో ఉండగా అందులో 28 పాఠశాలల్లో స్పోర్ట్స్ అకాడమీలు ఉన్నాయన్నారు. 30 చోట్ల మహిళా డిగ్రీ కళాశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ జోనల్ మీట్ సందర్భంగా 9 పాఠశాలల విద్యార్థులు పాల్గొని ఎంతో చక్కగా మార్చ్ ఫాస్ట్ నిర్వహించారన్నారు. విద్యార్థులను, వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు.మంచి ప్రణాళికతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అన్నారు.బలమైన లక్ష్యం ఎదిగేందుకు తోడ్పడుతుందన్నారు. గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కృష్ణ ఆదిత్య విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా ఎంతగానో సహకరిస్తున్నారన్నారు. వారిని ప్రోత్సహిస్తూ చదువులో ప్రతిభ కనబరిచేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు.క్రీడా స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. కార్యక్రమం ప్రారంభించడానికి ముందు సక్రు నాయక్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు.జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, గురుకుల విద్యాలయాల సంస్థ ఫౌండర్ ఎస్ ఆర్ శంకరన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండా, స్పోర్ట్స్ జెండా, సొసైటీ జెండాలను ఆవిష్కరించారు. క్రీడలను ప్రారంభించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సూర్యాపేట,నల్లగొండ జిల్లాలోని నడిగూడెం, మఠంపల్లి,నకిరేకల్, డిండి,నిడమనూరు, కొండమల్లేపల్లి,జీవి గూడెం,కట్టంగూర్, సూర్యాపేట పాఠశాలలకు చెందిన 765 మంది విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డిసిఓ సిహెచ్ పద్మ, నడిగూడెం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ చింతలపాటి వాణి, ఎంపీడీవో మల్సూర్ నాయక్, ఎంఈఓ ఉపేందర్ రావు,
యస్ఐ జి. అజయ్ కుమార్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ విజయ నాయక్, ఆయా పాఠశాలల ప్రధాన ఆచార్యులు విద్యాసాగర్, అరుణ, సుష్మ, శ్రీరామ్, కృష్ణా నాయక్, వరలక్ష్మి, డి వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ విజయశ్రీ, సునీత, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.