
జనం న్యూస్ నవంబర్ 08 మునగాల
చలికాలం వ్యాధులు ముసిరేకాలం కొద్ది రోజులుగా ఉదయం, రాత్రివేళల్లో చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయి ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో సాధారణ ఉష్ణాగ్రతలు తగ్గుముఖం పట్టాయి. చలి పెరిగినప్పుడు గాలిలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు త్వరగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డిసెంబర్,జనవరిలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.శీతాకాలంలో జలుబు, చర్మవ్యాధులు, శ్వాసకోశ, నిమోనియా లాంటి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాధారణ జలుబును నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తులకు సంబంధించిన నిమోనియా సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది. జలుబు లక్షణాలు కనిపిస్తే సిట్రజిన్, ప్యారసిటమాల్ను మాత్రమే వాడాలి.యాంటీబయాటిక్ మాత్రలు వేసుకోవడం శ్రేయస్కరం కాదు. చిన్న పిల్లలకు జలుబు చేస్తే ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేయొద్దు. ఆస్తమా ఉన్న వారు చలిలో బయటకు వెళ్లకుండా చూడాలి. చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి పదార్థాలు తీసుకోవడం పూర్తిగా మానేయాలి. ఇంట్లో దోమలు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఉద యం వేళ్లలో వాకింగ్‌కు వెళ్లే వారు చర్మాన్ని కప్పి ఉండే దుస్తులతో బయటకు వెళ్లాలి. లోదుస్తులను ఉతక్కుండా ధరిస్తే గజ్జి, తామర లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.చలికాలంలో ప్రతిఒక్కరూ కొద్దిపాటి వ్యాయామం చేయాలి. గోరువెచ్చని నీళ్లు తాగడం, సాధ్యమైనంత వరకు వేడి ఆహార పదార్థాలు తినాలి. బయటకు వెళ్లాల్సి వస్తే రగ్గులు, మాస్కులు, ధరించాలి. సొరియాసిస్ ఉన్న వారికి ఇబ్బందులు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. వాతావరణ మార్పులతో ప్రస్తుతం అంతటా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. వీటి గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదు. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే సరిపోతుంది. చలికాలంలో మలేరియా, డెంగీ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో, పరిసర ప్రాంతాల్లో దోమలు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
