
జనం న్యూస్ 10 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
భారత విద్యార్థి పరిషత్ (ఎస్ఎఫ్ఐ) విజయనగరం పట్టణ కమిటీ మహాసభలు తాటిపూడి డ్యాం నందు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాము మాట్లాడుతూ, "అధ్యయనం పోరాటం అనే నినాదాలతో గత 55 సంవత్సరాలుగా దేశంలో అనేక విద్యారంగ సమస్యలపై భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అనేక పోరాటాలు నిర్వహిస్తోందని, ప్రభుత్వ విద్య బలోపేతమే లక్ష్యంగా పోరాటాలు చేస్తూ అనేక విజయాలు సాధించిందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో మరియు రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నాశనం చేసే విధంగా అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాయని, నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యలో కాషాయీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ అనే మూడు విష బీజాలు నాటుతోందని విమర్శించారు. ఇదే సందర్భంలో విద్యావ్యవస్థకు నిధులు లేవని కుంటి సాకులు చూపుతూ కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతున్నాయని విమర్శించారు. ఒక దేశంలో ఆ దేశ ప్రజానికం బాగుపడాలన్నా, నాశనమవ్వాలన్నా అది విద్య ద్వారానే జరుగుతోందని అటువంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉందని డిమాండ్ చేశారు. జిడిపిలో ఆరు శాతం, కేంద్ర బడ్జెట్లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండేళ్లుగా దాదాపుగా 7000 కోట్ల స్కాలర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని వాటిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని వసతి గృహాల్లో స్టాఫ్ పోస్టులు భర్తీ చేయాలని వార్డెన్లు లేని చోట వార్డెన్ ను తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. విజయనగరం పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రభుత్వం బహుమతిగా ఏమీ ఇవ్వలేదని ఎన్నో ఏళ్లుగా విద్యార్థులు చేసిన అలుపెరగని కృషి వల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విజయనగర పట్టణంలో సాధించుకున్నామని అటువంటి ఉద్యమ ఫలాన్ని ప్రభుత్వం నేడు పట్టణం నుంచి బయటకు తరలించి మరో ప్రాంతంలో పెట్టడం ఇక్కడ ఉన్న విద్యార్థులను మోసం చేయడమేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయనగర పట్టణం నుంచి తరలించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తిరిగి పట్టణంలోకి తీసుకురావాలని లేని ఎడల పెద్ద ఎత్తున విజయనగరం పట్నంలో పోరాటం నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మహాసభల సందర్భంగా మహాసభ ప్రతినిధులు పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. వాటిలో ప్రధానంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు నిర్మించాలని, పట్టణంలో ఉన్న సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని, మహిళా విద్యార్థులకు వసతి గృహాల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం వేగవంతం చేయాలని, జేఎన్టీయూ జీవీకేకి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని మొదలగు తీర్మానాలను ప్రవేశపెట్టారు. విజయనగర పట్టణ కార్యదర్శి కే రాజు ప్రవేశపెట్టిన నివేదికను ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం 18 మందితో నూతన పట్టణ కమిటీ ఎన్నుకున్నారు. నూతన పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా కే సూరిబాబు, ఈ వంశీలు ఎన్నికయ్యారు. పట్టణ సహాయ కార్యదర్శిలుగా జయ, సౌమ్య, ఉపాధ్యక్షులుగా రూప, పట్టణ కోశాధికారిగా గుణ ఎన్నికయ్యారు.