
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్
జనం న్యూస్ 11 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం దిబ్బగుడ్డివలస గ్రామంలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ 'పల్లె నిద్ర' చేపట్టి, ప్రజలతో నవంబరు 9/10న మమేకమయ్యారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేసే సంకల్పంతో 'పల్లె నిద్ర' చేపట్టాలని అధికారులను ఆదేశించండంతోపాటు, జిల్లా ఎస్పీ గారే స్వయంగా 'పల్లె నిద్ర' కార్యక్రమంలో భాగంగా మారుమూల గ్రామంలో రాత్రి బస చేసి, అధికారులకు ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ- గ్రామంలో ప్రధాన సమస్యలను, పోలీసుశాఖ పరంగా చేపడుతున్న కార్యక్రమంలు, శాంతిభద్రతల సమస్యలు, మాదక ద్రవ్యాల ప్రభావం, సైబరు మోసాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో చాలామంది వ్యక్తులు సైబరు మోసాలకు గురవుతున్నారని, నేరాలు జరుగుతున్న తీరును ప్రజలకు వివరించి, అప్రమత్తంగా ఉండాలని కోరారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని కొంతమంది సైబరు నేరగాళ్ళు వాట్సాప్ కాల్స్ చేసి తమను డిజిటల్ అరెస్టు చేస్తున్నామని, ఇంటి నుండి బయటకు వెళ్ళ వద్దని, మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్నారని, ఆధార్ కార్డును దుర్వినియోగం చేసారని, మీ పిల్లలపై డ్రగ్స్ కేసు నమోదయ్యిందని, సిబిఐ లేదా ఎన్ఫోర్స్మెంట్ లేదా సిఐడి లేదా కోర్టు నుండి అధికారులుగా పరిచయం చేసుకొని, బెదిరింపులకు పాల్పడుతుంటారని, చివరకు సహాయం చేస్తున్నట్లుగా నమ్మబలికి, అమాయకుల నుండి డబ్బులను కొల్లగొడుతున్నారన్నారు. ఇటువంటి నేరగాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మవద్దని, ఎవరైనా ఈ తరహాలో ఫోనులు చేస్తే సమాచారాన్ని డయల్ 100/112 లేదా 1930కు అందించాలన్నారు. పోలీసులు 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి మీకు సహాయవడతారని జిల్లా ఎస్పీ అన్నారు. మరికొంత మంది వ్యక్తులు చిన్న మొత్తంలో డబ్బులను ఇచ్చి, వారి నుండి ఆధార్ కార్డులను తీసుకొని, బ్యాంకు ఖాతాలను ప్రారంభించి, ఆ ఖాతాలను తప్పుడు పనులకు వినియోగిస్తారన్నారు. కావున, డబ్బులకు ఆశ పడి ఎవ్వరూ తమ ఆధార్ కార్డులను, ఫోను నంబర్లును గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వొద్దన్నారు. గ్రామంలో నేరాలు జరగకుండా నియంత్రించేందుకు ప్రజలందరూ సంఘటితమై సాధ్యమైనన్ని ఎక్కువ సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పిల్లలను బాగా చదువించుకోవాలని, ఉత్తమ మార్గంలో నడిపి, ఉన్నత స్థానాలకు చేరుకొనే విధంగా చూడాలన్నారు. చదువుకొనే సమయంలో మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి చెడు వ్యసనాలకు అలవాటుపడకుండా ఒక కంట కనిపెట్టాలన్నారు. గ్రామంలోకి వచ్చే అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దని, వారి ప్రవర్తనలో అనుమానాలుంటే స్థానిక పోలీసులకు తెలపాలన్నారు. పోలీసు వారి సూచనలు పాటించాలని, శాంతిభద్రతలకు ప్రజలందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ కోరారు.అనంతరం, గ్రామస్తులతో కలసి భోజనం చేసి, ప్రభుత్వ పాఠశాలలో బసచేసారు. గ్రామంలో జిల్లా స్థాయి అధికారి బస చేయడం, వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వివిధ నేరాలు జరుగుతున్న తీరు పట్ల, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలను, రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించడం పట్ల గ్రామస్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమంలో బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, బొబ్బిలి సిఐ కే.సతీష్ కుమార్, బొబ్బిలి రూరల్ సీఐ కే.నారాయణరావు, ఎస్ఐలు రమేష్, జ్ఞాన ప్రసాద్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.