
జనం న్యూస్ 13 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపి, ఎస్.కోట పోలీసులకు పట్టుబడిన నిందితుడు శివరామరాజు పేట గ్రామానికి చెందిన కపిరెడ్డి అప్పారావుకు ఎస్. కోట స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గండి అప్పల నాయుడు గారు 7 రోజుల జైలు శిక్ష విధించినట్లుగా జిల్లా ఎస్పీ దామోదర్ నవంబరు 12న తెలిపారు.వివరాల్లోకి వెళితే - ఎస్.కోట పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎల్.చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది నవంబరు 12న శివరామరాజు పేట జంక్షను వద్ద వాహన తనిఖీలు చేపట్టగా శివరామరాజు పేట గ్రామానికి చెందిన కపిరెడ్డి అప్పారావు మద్యం సేవించి శివరామరాజు పేట గ్రామం నుండి ఎస్.కోట వైపు మోటార్ సైకిల్ నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారన్నారు. పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేయగా, సదరు వాహనదారుడు మద్యం సేవించి ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసారన్నారు. సదరు వ్యక్తిని ఎస్.కోట పోలీసులు నవంబరు 12న స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, ఎస్.కోట వారి వద్ద హాజరుపర్చగా స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గండి అప్పలనాయుడు గారు నిందితుడు కపిరెడ్డి అప్పారావు కు 7 రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. వరుసగా రెండవ రోజు కూడా డ్రంకన్ డ్రైవ్ కేసులో 7 రోజుల జైలు శిక్ష పడిందని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.మద్యం సేవించి వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నందున ఈ తరహా నేరాన్ని తీవ్రంగా పరిగణించి, నిందితులకు జైలుశిక్ష విధించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇకపై జైలు శిక్ష తప్పదని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు.