
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్
జనం న్యూస్ 15 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం పట్టణం కంటోన్మెంట్ లోగల పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు నవంబరు 14న ఘనం నిర్వహించగా, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - భారత మొట్ట మొదటి ప్రధాని అయిన చాచా నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టమని, ఆయన ఏ కార్యక్రమానికి వెళ్ళిన పిల్లలను తరుచూ కలుస్తూ, వారితో ముచ్చటించే వారన్నారు. నెహ్రూ మంచి విద్యావేత్తగా, ఆర్ధికవేత్తగా, ప్రధానిగా భారత దేశానికి విశేషమైన సేవలందించారన్నారు. చాచా నెహ్రూకు బాలల పట్లగల ప్రేమాభిమానాల కారణంగా ఆయన జన్మ దినాన్ని బాలల దినోత్సవంగా పరిగణించారన్నారు. చదువంటే అంటే కేవలం విద్యార్థులకు పాఠాలను చెప్పడమే కాకుండా, భవిష్యత్తులో వారికి ఉపయోగపడే విషయ పరిజ్ఞానాన్ని అందించాలని, తద్వారా వారి ఉన్నతికి సహాయపడాలన్నారు. బాలల ఆసక్తిని గమనించి, ఆయా రంగాల్లో ఉన్నతంగా ఎదిగేందుకు వారిని ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు వ్యక్తిత్వ వికాశానికి మెరుగు పర్చుకొనే విధంగా సమన్వయం చేస్తూ, ఉపాధ్యాయులు ఉన్నత విద్యను అందించాలన్నారు. విద్యార్థులు ఏ రంగాన్ని ఎంచుకున్నా, వాటిలో నిష్నాతులుగా ఎదిగేందుకు ప్రయత్నం చేయాలన్నారు. నేడు అన్ని రంగాల్లోను అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకొని, రాణించాలన్నారు.బాలల దినత్సోవం సందర్భంగా స్కూల్ లో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ బహుమతులను ప్రదానం చేసారు. అనంతరం, విద్యార్థులకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి. నాగేశ్వరరావు, చాక్లెట్స్, బిస్కెట్స్ పంచి పెట్టి, విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాలల దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, విద్యార్ధుల వేషధారణ ఆహ్వానితులను, తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరావు, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్ఐలు ఎన్.గోపాల నాయుడు, టి.శ్రీనివాసరావు, హెచ్.ఎం. సంధ్య, ఆర్.ఎస్.ఐలు వర ప్రసాద్, సూర్యనారాయణ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.