
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపిఎస్
జనం న్యూస్ 15 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా ఎల్. కోట పోలీసు స్టేషన్లో 2021 సం.లో జరిగిన భూతగాదాల వల్ల ఎల్.కోట మండలం రేగ గ్రామానికి చెందిన వ్యక్తిని అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కొడవలి మరియు కర్రలతో దాడి చేసి హత్య చేసారు. ఈ కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు మరియు రూ.3000/- ల జరిమాన విధిస్తూ విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ ఎ. ఆర్. దామోదర్ నవంబర్ 14న తెలిపారు.వివరాల్లోకి వెళ్ళితే.. ఎల్.కోట మండలం రేగ గ్రామానికి చెందిన గొల్ల ఈశ్వరరావు (45 సం.లు)కు అతని సోదరుడికి భూతగాదాలు జరుగుతుండేవరన్నారు. ఈ విషయమై తే. 25-07-2021 దిన అన్నయ్య గొల్ల విశ్వనాధం మరియు కుటుంబ సభ్యులు ఇంట్లోకి ప్రవేశించి గొల్ల ఈశ్వరావుతో గొడవ పడి, కొడవలి మరియు కర్రలతో దాడి చేసి హత్య చేసారు. ఈ విషయమై మృతుడి కొడుకు గొల్ల బాలాజీ ఎల్. కోట పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎల్.కోట ఎస్ఐ కె. లక్ష్మణ రావు కేసు నమోదు చేయగా, అప్పటి ఎస్.కోట సిఐ ఎస్.సింహాద్రి నాయుడు దర్యాప్తు చేపట్టి, విచారణ చేసి, నేరంకు పాల్పడినట్లుగా ఎల్.కోట మండలం రేగ గ్రామానికి చెందిన నిందితులు ఎ-1 గొల్ల అప్పారావు (35 సం.లు), ఎ-2 గొల్ల విశ్వనాధం (61 సం.లు), ఎ-3 గొల్ల దేముడమ్మ (45 సం.లు), ఎ-4 గొల్ల లక్ష్మి (30 సం. లు) లను అరెస్టు చేసి, న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు.ఈ కేసు విచారణలో ఉండగా నిందితుడు ఎ-1 గొల్ల అప్పారావు (35 సం.లు) మరణించగా, మిగిలిన ముగ్గురు నిందితులపై (ఎ-2 నుండి ఎ-4) నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎం. బబిత నిందితులకు జీవిత ఖైదు మరియు ఒక్కోకరికి రూ.3000/-ల చొప్పున జరిమాన విధిస్తూ నవంబర్ 14న తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితులకు శిక్షింపబడే విధంగా సాక్షులకు బ్రీఫ్ చేసి, సాక్ష్యం చెప్పే విధంగా ఎల్.కోట కోర్టు హెడ్ కానిస్టేబులు కే.రమేష్, సి.ఎం.ఎస్. ఎస్ఐ పి.ఈశ్వర రావు సమర్ధవంతంగా పని చేసారన్నారు. పోలీసు వారి తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటరు జి.సత్యం వాదనలు వినిపించగా, ఎస్.కోట రూరల్ సిఐ ఎల్. అప్పల నాయుడు, ఎల్. కోట ఎస్ఐ నవీన్ పడాల్ ప్రాసిక్యూషను జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నారు. నిందితులు శిక్షింపబడే విధంగా చర్యలు చేపట్టిన పిపి, పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎ. ఆర్. దామోదర్ అభినందించారు.