
జనం న్యూస్ 19 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
సిపిఐ దేశవ్యాపిత ఆందోళన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు
కేంద్రంలో నరేంద్రమోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్ళ కాలంలో దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు మితిమీరిపోతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు విజయనగరం జిల్లా సిపిఐ నిర్మాణ భాద్యులు పి. కామేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.సామాజిక న్యాయం- ఆత్మగౌరవం కోసం దళిత, గిరిజన, మైనారిటీల పై దాడులను ఖండిస్తూ జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) దేశవ్యాప్త ఆందోళనల పిలుపులో భాగంగా మంగళవారం ఉదయం విజయనగరంలో స్థానిక ఆర్టీసీ కంప్లెక్స్ దగ్గర సిపిఐ విజయనగరం నియోజకవర్గ కార్యదర్శి బుగత అశోక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు మీడియాలో మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్ళ కాలంలో దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు మితిమీరిపోతున్నాయని అన్నారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామిక హక్కులను హరించే దుష్ట శక్తులను తిప్పికొట్టేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. దేశంలో మతోన్మాదం, అణిచివేత, అంటరానితనం, కుల వివక్షత, హింస పేట్రేగిపోతున్నాయని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్, సంఘపరివార్ కనుసన్నలలో భారత రాజ్యాంగ, లౌకిక, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగిస్తున్నారన్నారు. రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులు సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వానికి మోడీ అండ్ కో ప్రభుత్వం పాతర వేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో- 2023 నివేదిక ప్రకారం, షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వారిపై జరిగిన నేరాలకు 57,789 కేసులు: షెడ్యూల్డ్ తెగల (ఎస్టి) వారిపై జరిగిన నేరాలకు 12,960 కేసులు నమోదవ్వగా, మహిళలపై 4.48 లక్షల నేరాలు నమోదవ్వడం విచారకరమన్నారు. ఈ ఘోరాలు ప్రతి ఏటా పెరగడం ఆందోళనకరమన్నారు. ఇటీవల భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి పై సనాతన వాది దాడికి పాల్పడిన ఘటన ఒక మచ్చుతునక మాత్రమేనన్నారు. మోడీ పాలనలో ఎస్సి, ఎస్టి, మైనారిటీలకు రక్షణ ప్రశ్నార్ధకమైందన్నారు. అణగారిన వర్గాల హక్కులు హరించబడుతున్నాయన్నారు. ప్రశ్నించే వారిపై మతోన్మాదులు దాడులకు, హత్యలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. గిరిజనుల పొట్టకొట్టేలా, అడవిబిడ్డల హక్కులను హరించేలా అడవులను, సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు పాలకులు కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఈ విధానాలు సమాజానికి, దేశానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయని అన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 143 వెనుకబడిన కులాలున్నాయి. గత స్థానిక సంస్థలలో బిసిలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వలన వేలసంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవులను బిసిలు కోల్పోయారన్నారు. తెలంగాణాలో ప్రభుత్వ జనాభా లెక్కల సందర్భంగా కులగణన చేపట్టి, అందుకనుగుణంగా ఎస్సి, ఎస్టి, బిసి వర్గాలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించిందని గుర్తు చేశారు. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా జనగణనలో కులగణన చేపట్టి, కులాల ప్రాతిపదికన బిసిలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తూ అన్నీ వర్గాల వారిని ఐక్యం చేస్తూ దేశవ్యాపీతంగా నిర్వహిస్తున్న ఆందోళనలలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, లౌకిక వ్యవస్థను కాపాడేందుకు సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు 'సామాజిక న్యాయం సమానత్వం ఆత్మ గౌరవం' కోసం, జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) చేపడుతున్న ఆందోళనల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఐ విజయనగరం నియోజకవర్గ కార్యదర్శి బుగత అశోక్, సభ్యులు ఎస్.రంగరాజు, పొందూరు అప్పలరాజు, ఎ.రాములు, కె. స్రవంతి, పొడుగు రామకృష్ణ, బూర వాసు, వెలగాడ రాజేష్, సూరిడమ్మ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.