
జనం న్యూస్ నవంబర్ 27:జహీరాబాద్
పట్టణంలోని భవాని మందిరం రోడ్డులో నూతనంగా నిర్మించిన రతన్ కీర్తన్ హాల్ వేద ఆశీర్వచనాల మధ్య మంగళవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. సంగీత అభిమానులకు, భజన ప్రియులకు సౌకర్యంగా ఉండేవిధంగా కీర్తన్ హాల్ ను తీర్చిదిద్దారు. అయోధ్య శ్రీరామ మందిరం ధ్వజారోహనం సందర్భంగా రతన్ కీర్తన్ హాల్ ప్రారంభించడం పట్ల ఏకాదశి భజన మండలి, జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ బృందం శ్రీ రాముడి కీర్తనలు, శ్రీకృష్ణ భక్తి గీతాలు, శివ స్తుతులతో హాల్ మొత్తం దద్దరిల్లింది. ఈ క్రమంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త భరత్ ఓజా జన్మదినం తో పాటు జహీరాబాద్ పట్టణ వ్యాపార వేత్త ఘన్ శ్యామ్ జాజు, కిరణ్ జాజుల 38 వ వివాహ వార్షికోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కీర్తన హాల్ నిర్వాహకులు రామ్ రతన్ సారడా, వందన సారడా, సాక్షి సారడా కుటుంబికులు వారిని ఘనంగా సత్కరించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా భక్తులకు కేకులు పంచిపెట్టారు. హనుమాన్ మందిరం అర్చకులు ఆశిష్ తివారి మహారాజ్ వేద ఆశీర్వచనాలు అందజేయగా భక్తులు అభినందనలు తెలియజేశారు. తమ వివాహ వార్షికోత్సవం, జన్మదినం హరేకృష్ణ భక్తుల మధ్య జరుపుకోవడం అత్యంత సంతోషం కలిగించిందని ఘన్ శ్యామ్, కిరణ్ జాజు, భరత్, ప్రీతి ఓజా దంపతులు ఆనందోత్సాహల మధ్య వెల్లడించారు. భక్తులు కీర్తనలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ భక్తి భావంలో మునిగిపోయారు.
