
జనం న్యూస్ డిసెంబర్ 04: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం
:బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సాహిత్య పోటీల్లో ఏర్గట్ల ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థిని జక్కని వైష్ణవి నాటిక విభాగంలో రెండవ బహుమతి, వచన కవిత విభాగంలో ప్రోత్సాహక బహుమతిని సాధించినట్లు పాఠశాలప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణచారి గురువారం వెల్లడించారు. విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీయడంలో సాహిత్య అకాడమీ పోటీలు కీలకమని ఆయన చెప్పారు. రాష్ట్రస్థాయిలో వైష్ణవి బహుమతులు దక్కించుకోవడం పాఠశాలకు మరింత ప్రతిష్ఠను తెచ్చిందని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే చదువుతో పాటు పలు రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ ఉపాధ్యాయుల ఆదరణ పొందుతున్న విద్యార్థిని అని తెలిపారు. త్వరలో హైదరాబాదులోని రవీంద్రభారతిలో రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా బహుమతులు స్వీకరించనుందని వివరించారు. వైష్ణవిని నిశితంగా మార్గనిర్దేశం చేస్తున్న తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ సేవలను ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. వైష్ణవి, ప్రవీణ్ శర్మకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.