
జనం న్యూస్ 5 డిసెంబర ప్రతినిధి కాసిపేట రవి )
రానున్న ఎన్నికల గ్రామాలలో కనిపిస్తున్న రాజకీయ విభేదాలు, వ్యక్తిగత తగాదాలపై పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. “ఎలక్షన్లో ఏ నాయకుల కోసమో బంధాలు–బంధుత్వాలు దూరం చేసుకోకండి” అని ప్రజలకు సూచించారు.ఎవరి రాజకీయ అభిమానం ఎవరి పట్ల ఉన్నా అది వ్యక్తిగత నిర్ణయం మాత్రమేనని, కానీ కుటుంబ బంధాలు, బంధుత్వాలు మాత్రం జీవితంలో అత్యంత విలువైనవని పెద్దలు గుర్తుచేశారు. నాయకులు మారవచ్చు, పార్టీలూ మారవచ్చు, కానీ మనుషుల మధ్య ప్రేమ, అనుబంధం మాత్రం శాశ్వతమై ఉండాలని అన్నారు.ఓటు వేసేది మనసు నచ్చిన నాయకుడికి మాత్రమే, కానీ దాని కోసం కుటుంబాల్లో విభేదాలు రావడం సమాజానికి నష్టం చేస్తుందని పెద్దలు హెచ్చరించారు. “ఈరోజు మనం గొడవపడితే, రేపు ఆ నాయకులు కలిసిపోయినా మన కుటుంబాలు మాత్రం పగతోనే మిగిలిపోతాయి” అని వారు స్పష్టం చేశారు.
ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగగా ఉండాలని, పరస్పర గౌరవం, అభిప్రాయ భిన్నతలను అంగీకరించే సంస్కృతి పెరగాలని పెద్దలు సూచించారు. గ్రామాభివృద్ధి, శాంతి వాతావరణం కోసం సమైక్యతే శక్తి అవుతుందని పౌరులకు పిలుపునిచ్చారు.