
జనం న్యూస్ డిసెంబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన
మండల కేంద్రమైన కాట్రేనికోనతో పాటు పలు గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రధాన రోడ్లపై ఆవులు, ఆంబోతులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. వీటి బారిన పడి అనేకమంది గాయపడిన సంఘటనలు గతంలో జరిగాయి. ఆవుల సంచారం పై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గతంలో పంచాయతీ సిబ్బందిఆధ్వర్యంలో కొన్ని ఆవులను పంచాయతీ ఆవరణలో బంధించారు. అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా వాటి యజమానులు వాటిని తీసుకుని పోయారు. అనేకసార్లు పంచాయతీ మైఖేల్ ద్వారా అనౌన్స్మెంట్ చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా పశువుల యజమానుల్లో ఎటువంటి మార్పు రాలేదు. పాలు మాకు తన్నులు మీకు అన్న రీతిలో వ్యవహరించారు. శుక్రవారం రాత్రి కాట్రేనికోన ఎస్సై అవినాష్, సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ పర్యవేక్షణలో సిబ్బంది ఆవులను బంధించారు. వాటిని కరవాక ప్రాంతానికి వాహనాలపై తరలించారు. ఈ సమయంలో పశువుల యజమాని ఒకరు పైరవీలకు దిగారు. దీంతో ఎస్ఐ అతనికి మాస్ లెవెల్ లో వార్నింగ్ ఇచ్చారు. ప్రయాణికులు వ్యాపారస్తులు ఈ ఆవులు వల్ల ఇబ్బందులు పడుతుంటే రోడ్లపై వదిలేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో రోడ్లపై సంచరించే పశువులను ఇదేవిధంగా తీరప్రాంతాలకు తరలిస్తామని ఎస్ఐ హెచ్చరించారు. ఆవులు తిండి లేక ప్లాస్టిక్ వ్యర్ధాలు, చిత్తు కాగితాలు తింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాట్రేనికోనలో ఎవరైనా రోడ్లపైకి పశువులను వదిలేస్తే పశువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు యజమానులపై కేసులు పెడతామని సర్పంచ్ సుధాకర్ హెచ్చరించారు.
