
జనం న్యూస్ 11 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
చిన్న పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలని, అక్రిడిటేషన్ నిబంధనలను సడలించాలని విజయనగరం జిల్లాలోని చిన్న పత్రికల సంపాదకులు ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు. పల్లెపల్లెకూ వార్తను మోసుకెళ్లి, స్థానిక సమస్యలకు గొంతుకగా నిలిచిన చిన్న పత్రికలు నేడు అక్రిడిటేషన్ సంకెళ్లు, ఆర్థిక భారంతో నలిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం విజయనగరంలో సంఘం నాయకులు పంచాది అప్పారావు, కె.జె. శర్మ, సత్యనారాయణ, నాగరాజు, రవిచంద్ర శేఖర్, రమణ, తదితరుల ఆధ్వర్యంలో చిన్న పత్రికల సంపాదకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విజయనగరం టౌన్, ఎస్.కోట, రాజాం తదితర ప్రాంతాల నుంచి దాదాపు 50 మంది డైలీ, పక్ష, వార, మాస పత్రికల సంపాదకులు హాజరయ్యారు.సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలిసమావేశంలో సంపాదకులు మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలోనూ చిన్న పత్రికలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని గుర్తుచేశారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి కార్యక్రమాల గూర్చి పత్రికల్లో సమగ్రంగా ప్రచురిస్తూ, ప్రజా చైతన్యం తీసుకువస్తున్న తమ పట్ల ప్రభుత్వం, అధికారులు మరింత సానుకూలంగా వ్యవహరించాలని కోరారు.ముఖ్య డిమాండ్లుచిన్న, మధ్యతరహా పత్రికలకు అక్రిడిటేషన్ల మంజూరులో తగిన ప్రాధాన్యత కల్పించాలని సంపాదకులు ప్రధానంగా డిమాండ్ చేశారు.అక్రిడిటేషన్ల సంఖ్య పెంచాలి: ప్రస్తుత ప్రభుత్వ జీ.ఓ. ప్రకారం చిన్న పత్రికలకు కేవలం రెండు అక్రిడిటేషన్లు మాత్రమే మంజూరు అవుతున్నాయి. ఈ పరిమిత సంఖ్య వలన, ప్రతి మండలంలో, నియోజకవర్గంలో పనిచేస్తున్న కనీసం నలుగురు విలేకరులు గుర్తింపుకు దూరమవుతున్నారు. జిల్లా స్థాయిలో ఎడిటర్, స్టాఫ్ రిపోర్టర్లతో పాటు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరి వంతునైనా అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కోరారు. మాస పత్రికలకు కనీసం రెండు అక్రిడేషన్లు ఇవ్వాలన్నారు.జీతాలు లేని కష్టాలు: తమ పత్రికల్లో పనిచేసే అనేక మంది విలేకరులకు స్థిరమైన జీతాలు లేవు. అక్రిడిటేషన్ కార్డు లేకపోవడం వలన, వార్తా సేకరణ కోసం అయ్యే ఖర్చులను, ముఖ్యంగా బస్సులలో ఉచిత/రాయితీ ప్రయాణ సౌకర్యాన్ని పొందలేక సొంతంగా భరించాల్సి వస్తుంది.ప్రకటనలలో ప్రాధాన్యత: ప్రకటనల విడుదలలో కూడా చిన్న పత్రికలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.వృత్తి గౌరవం: ప్రభుత్వ గుర్తింపు లేకపోవడం వలన విలేకరులు అధికారిక సమావేశాలకు, ఉన్నతాధికారుల పత్రికా సమావేశాలకు ప్రవేశం పొందలేకపోతున్నారు. ఇది వారి వృత్తి గౌరవాన్ని తగ్గించి, ప్రజలకు సకాలంలో సమాచారాన్ని అందించకుండా అడ్డుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.కాగితం ధరల మంట, ప్రకటనల కరువు ఒకవైపు దహించి వేస్తుంటే... ప్రభుత్వాల చిన్నచూపు వారి జీవనాన్ని, వృత్తి గౌరవాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయని సంపాదకులు పేర్కొన్నారు.కలెక్టర్కు వినతి పత్రంతమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15వ తేదీ సోమవారం జిల్లా కలెక్టర్ నిర్వహించే 'స్పందన' కార్యక్రమంలో వినతిపత్రం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం, భవిష్యత్తులో కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం 12 మందితో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏవి ఎస్ ఎస్ కే జే శర్మ ,విఎం కే లక్ష్మణరావు జి అరుణ్ కుమార్ జేవియర్ గోపాల్ వర్మ, ఆర్.సి.యం చౌదరి, దిక్సూచి శ్రీను, సన్నీ బాబు,శంకర్రావు ఆనంద్, మంత్రి ప్రగడ రవికుమార్, సేరాపు శ్రీనివాసరావు, మజ్జి శివకుమార్ గురుప్రసాద్ ఆదినారాయణ, గౌరీ శంకర్ అప్పారావు తిరుపతిరావు రామ్మోహన్ ఆచారి శివపత్రికి శివ జ్ఞాన బేరి పాత్రో రాజేష్ పట్నాయక్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు