
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 15 జహీరాబాద్, డిసెంబర్ 1
మనిషి శ్రీకృష్ణ భగవానునికి నిత్యదాసుడని, కృష్ణ భక్తిభావనలో కర్మలను ఆచరించడమే నిజమైన ధర్మమని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ ప్రతినిధి విభిషణ్ ప్రభుజీ సెలవిచ్చారు. జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో పట్టణంలోని మహీంద్రా కాలనీ వెంకటేశ్వరాలయం ప్రాంగణంలో ఆదివారం నాడు 185వ నగర సంకీర్తన అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సత్సంగ సమావేశంలో ఆయన భక్తులనుద్దేశించి ప్రవచించారు. కృష్ణ రసభావనలో మనిషి నిమగ్నమై ఉండడం ద్వారా శ్రీకృష్ణ భగవానునితో ప్రత్యక్ష బంధాన్ని ఏర్పరుచుకోగలరని వెల్లడించారు. భగవానుని ఆదేశాలు పాటించే భక్తులు కర్మ బంధనాలను బడసి దివ్యస్థితికి చేరుకొంటారని పేర్కొన్నారు. ప్రస్తుత కలియుగంలో హరేకృష్ణ మహామంత్రమే ముక్తికి మార్గమని, ప్రతిరోజూ మహమంత్రం జపం చేయడం ద్వారా కలిగే అనుభూతిని వెరెవరూ పొందలేరని అన్నారు. ఈ సందర్బంగా శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగంలోని 53 వ శ్లోకాన్ని సోదాహరణంగా వివరించారు. అంతకుముందు శ్రీకృష్ణ కీర్తనలతో కాలనీలోని ప్రధాన వీధులలో శోభయాత్ర నిర్వహించారు. కీర్తనలకు అనుగుణంగా భక్తులు నృత్యాలు చేస్తూ ఆనందపారవశ్యంలో మునిగిపోయారు. ఇదే క్రమంలో 185 వారాలుగా అప్రతిహతంగా కొనసాగుతూ వస్తున్న నగర సంకీర్తన కార్యక్రమాన్ని వివిధ మాధ్యమాల ద్వారా జన బహుళ్యానికి పరిచయం చేస్తూ ప్రాచుర్యం కల్పిస్తున్న ప్రముఖ పాత్రికేయులు వై. శ్రీనివాస్ రెడ్డి, జె శ్రీనివాస్ రెడ్డి, అంజన్న, మోహనరెడ్డి, జ్ఞానరెడ్డి, వీరేశం లకు విభిషణ్ ప్రభుజీ శాలువాతో సత్కరించి భగవద్గీత పుస్తకాలను అందజేశారు. ఇదిలా ఉండగా జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామంలోనూ ఆ గ్రామ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో 150 వ పల్లె సంకీర్తన అట్టహాసంగా జరిగింది. గ్రామ ఆంజనేయస్వామి ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర గ్రామ వీధుల మీదుగా జాతీయ రహదారిని చేరుకొంది. చిన్నారుల భక్తి కీర్తనలకు అనుగుణంగా బృందం యావత్తు నృత్యాలు చేస్తూ భక్తి భావంలో మునిగిపోయారు.అనంతరం స్థానిక స్వస్తిక్ రెస్టారెంట్ మహేందర్ గోడకే ప్రసాద వితరణ చేశారు.
శ్రీల ప్రభుపాదుల స్ఫూర్తి తో మార్నింగ్ వాక్ జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శ విద్యాలయం ప్రాంగణంలో శ్రీల ప్రభుపాదుల స్ఫూర్తి తో ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు హరేకృష్ణ మూమెంట్ బాధ్యులు ప్రకటించారు. మార్నింగ్ వాక్ లో భాగంగా హరేకృష్ణ మహామంత్ర జపం తో వాకింగ్, కీర్తనలు, ఏరోబిక్స్, యోగా, ప్రాణాయామం, కథా శ్రవణం కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం లో భాగస్వాములై మానసిక ప్రశాంతతో పాటు శారీరకంగా దృఢత్వం కలిగి ఉండాలని కోరారు.
