జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య..
జనం న్యూస్ 4 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)వైద్య సేవల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.మంగళవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల నిమిత్తం రోజు ఎంతమంది వస్తుంటారనే వివరాలను సంబంధిత ఆరోగ్య కేంద్రం వైద్యులను, సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసీలో మందులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు.అనంతరం కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రతి నెల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించి నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షల ద్వారా గుర్తించిన బిపి, షుగర్ పేషెంట్లకు ఉచితంగా మందులను ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తల ద్వారా అందే విధంగా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు.అదేవిధంగా ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల గ్రామాలలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. క్యాన్సర్ లక్షణాలను ముందస్తుగా గుర్తించి టెస్టులు చేయించుకున్నట్లయితే సమస్యను పరిష్కరించుకునే అవకాశం లభిస్తుందన్నారు. చాలా కేసులలో క్యాన్సర్ అనేది ఆఖరు దశలోనే తెలుస్తుందని, అప్పుడు ఎవరు ఏమి చేయలేని పరిస్థితి నెలకొని ఉంటుందన్నారు. కాబట్టి క్యాన్సర్ గురించి ప్రజలలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సరైన సమయంలో క్యాన్సర్ సంబంధిత వైద్య సేవలు గురించి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించినట్లయితే మంచి ట్రీట్మెంట్ తీసుకొని రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. ధూమపానం, మద్యపానం వలన తలెత్తే ఆరోగ్య సమస్యల పైన ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా అసంక్రమిత వ్యాధులకు సంబంధించి బీపీ, షుగర్ స్క్రీనింగ్ ప్రక్రియ అనేది చాలా తక్కువ శాతం కనిపిస్తుందని, నిర్దేశిత లక్ష్యం మార్చి 30 నాటికి 100% స్క్రీనింగ్ పూర్తి కావాలన్నారు. 30 ఏళ్ల వయసు పైబడిన వారికి బీపీ షుగర్ నిర్వహించాలని అన్నారు. గ్రామాలలో ఇప్పటివరకు ఎంతమందికి బీపీ, షుగర్ పరీక్షలను నిర్వహించారని, మిగతా వారికి కూడా పరీక్షలను పూర్తి చేయాలన్నారు. బిపి, షుగర్ భారీన పడిన వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. బీపీ, షుగర్ లకు దీర్ఘకాలంగా మందులు వాడాల్సి వస్తుంటుంది కాబట్టి ప్రభుత్వం అందిస్తున్న మందులను వారికి ఏఎన్ఎంలు, ఆశాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, స్థానిక తహసిల్దార్ జగత్ సింగ్, ఇతర అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.