
మణుగూరు, డిసెంబర్ 22 : జనం న్యూస్
సింగరేణి ఉన్నత పాఠశాల మణుగూరులో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్. కళ్యాణి మాట్లాడుతూ, గణితంలో శ్రీనివాస రామానుజన్ చేసిన సేవలు అద్వితీయమని కొనియాడారు. ఆయన రూపొందించిన అనేక సిద్ధాంతాలు, సూత్రీకరణలు మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. గణితం నిత్యజీవితంతో విడదీయరాని సంబంధం కలిగి ఉందని, గణితం సమస్య కాదని, సమస్యలకు పరిష్కారం చూపేదని పేర్కొన్నారు. అందుకే గణితాన్ని “సైన్స్లకు రాణి”గా పిలుస్తారని చెప్పారు. విద్యార్థులు గణితం పట్ల ఉన్న భయాన్ని వీడి ఆసక్తితో నేర్చుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసిన గణిత ప్రాజెక్టులను ప్రదర్శించారు. గణితంపై విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్లు, రంగోళి, నృత్యాలు ఆలోచింపజేస్తూ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఎం. వేణు, ఉపాధ్యాయులు మస్తానయ్య, లలిత, మమత, రజిత, సింధు ప్రియా, రజియా తదితరులు పాల్గొన్నారు.