
జనం న్యూస్ 24 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వ్యక్తిగత పీఏ సతీష్ పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. మంత్రి పీఏ సతీష్ వాట్సాప్లో అసభ్యకర సమాచారం పంపినట్లు మహిళ చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని, ఫోరెన్సిక్ దర్యాప్తులో మహిళ త్రివేణి, ఆమె స్నేహితుడు దేవీప్రసాద్ కలిసి ఫేక్ ఎస్ఎంఎస్ లు సృష్టించినట్లు నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు.
సతీష్ పై పగ తీర్చుకోవాలనే దురుద్దేశంతో ఫేక్ మెసేజ్ లు సృష్టించి తప్పుడు ఆరోపణలు చేశారని, మంత్రి కుమారుడుపై కూడా అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు. అసత్య ఆరోపణలకు పాల్పడిన మహిళా త్రివేణి, సహకరించిన దేవి ప్రసాద్ ను అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరాలను తెలిపారు. టెక్నాలజీ సహాయంతో నిజాలను వెలికి తీశామని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఎవరు తెలుసుకోలేరు, కనిపెట్టలేరు అని ఎవరిపైనైనా దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.