
పాత అనుమతులు చెల్లవు – మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి
జనం న్యూస్ డిసెంబర్ 27 సంగారెడ్డి జిల్లా:
నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణదారులు తప్పనిసరిగా మున్సిపాలిటీ నిబంధనలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో గతంలో తీసుకున్న భవన అనుమతులు ఇకపై పూర్తిగా చెల్లవని మున్సిపల్ అధికారులు వెల్లడించారు. నూతన నిబంధనలను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంద్రేశం ప్రాంతాన్ని ప్రభుత్వం ఇటీవల మున్సిపాలిటీగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టణీకరణను క్రమబద్ధీకరించేందుకు భవన నిర్మాణ నిబంధనలను అధికారులు కఠినతరం చేశారు. గ్రామ పంచాయతీల నుంచి గతంలో పొందిన అనుమతులతో ప్రస్తుతం నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధమని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.
ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రేశం, ఐనోల్, బచ్చుగూడ,రామేశ్వరం బండ, చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల గ్రామాల్లో నూతనంగా ఇళ్లు లేదా వాణిజ్య భవనాలు నిర్మించాలనుకునే వారు తప్పనిసరిగా మున్సిపల్ కార్యాలయం ద్వారా లేదా (టీజీ బిల్ నౌ – TG Bill Now) యాప్ ద్వారా ఆన్లైన్లో భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ పీ. మధుసూదన్ రెడ్డి తెలిపారు.నిబంధనలు అతిక్రమించి చేపట్టే అక్రమ నిర్మాణాలపై ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు చట్టబద్ధమైన విధానాలను అనుసరించి నిర్మాణాలు చేపట్టి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.