
జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ డిసెంబర్ 29 :
వైరా నియోజకవర్గ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ పేరు లేకుండా వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములు నాయక్ అనంతరం టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే తదుపరి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయంగా స్వతంత్రంగానే కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన వేళ, ఏన్కూర్, వైరా, కొనిజర్ల, కారేపల్లి, జూలూరుపాడు మండలాల్లో, వైరా నియోజకవర్గ స్థాయిలో పార్టీ గుర్తు లేకుండా రాములు నాయక్ ఫ్లెక్సీలు దర్శనమివ్వడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.రాములు నాయక్ తిరిగి బీఆర్ఎస్లో చేరతారా? లేక కొత్త రాజకీయ వేదికను ఎంచుకుంటారా? లేదా మరోసారి స్వతంత్రంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? అన్న అంశాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ఆయన అభిమానుల్లో బీఆర్ఎస్లో చేరితేనే అనుకూలమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.రాములు నాయక్ తాజా కదలికలు రాజకీయ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన తదుపరి నిర్ణయం త్వరలో వెలువడే అవకాశాలున్నాయని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.