
జనం న్యూస్ 30 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జాయింట్ చెక్ పవర్ దుర్వినియోగమైతే పదవి ఊడటమే కాదు… జైలు శిక్ష తప్పదు!జాయింట్ చెక్ పవర్ ప్రాముఖ్యత. గ్రామ పంచాయతీ నిధుల నిర్వహణలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఉమ్మడి సంతకం కీలకమైన భద్రతా వ్యవస్థగా ప్రభుత్వం పేర్కొంది. అభివృద్ధి పనుల కోసం వెచ్చించే ప్రతి రూపాయికి వీరిద్దరి ఆమోదం తప్పనిసరి. అయితే వ్యక్తిగత, రాజకీయ విభేదాల కారణంగా చెక్ పవర్‌ను అడ్డుకోవడం గ్రామాభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పారదర్శకతతోనే చట్టపరమైన రక్షణ గ్రామ పంచాయతీ నిధుల వినియోగానికి సంబంధించిన ప్రతి నిర్ణయం తప్పనిసరిగా గ్రామసభ తీర్మానం ద్వారానే జరగాలని ఆదేశించారు. నగదు లావాదేవీలకు బదులుగా ఆన్లైన్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఖర్చుల వివరాలను. సమయానుకూలంగా రికార్డుల్లో నమోదు చేయడం ద్వారా ఆడిట్ తనిఖీల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. పారదర్శకత పాటిస్తేనే ప్రజా ప్రతినిధులకు చట్టపరమైన రక్షణ లభిస్తుందని హెచ్చరించారు.
అధికార దుర్వినియోగానికి కఠిన శిక్షలు
ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడటం, పనులు పూర్తికాకుండానే బిల్లులు డ్రా చేయడం, తప్పుడు లెక్కలు చూపడం, సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి చర్యలు తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, పదవి నుంచి తొలగించడమే కాకుండా జైలు శిక్ష విధించే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుందని పేర్కొంది.
ఆధిపత్య పోరుతో అభివృద్ధికి బ్రేక్?
కొన్ని గ్రామాల్లో సర్పంచ్ – ఉప సర్పంచ్ మధ్య ఆధిపత్య పోరు అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని అధికారులు గుర్తించారు. రాజకీయ కారణాలతో కావాలనే బిల్లులపై సంతకాలు చేయకుండా పనులను నిలిపివేస్తే ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని హెచ్చరించింది. విచారణలో అభివృద్ధిని అడ్డుకున్నట్లు తేలితే, ఉప సర్పంచ్‌కు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు ఉందని స్పష్టం చేసింది.